Pakistan: భారత్‌పై మరోమారు ప్రశంసలు కురిపించిన ఇమ్రాన్ ఖాన్.. ఇండియాను చూసి స్వాభిమానాన్ని నేర్చుకోవాలన్న ప్రధాని

Pakistan should learn self pride from India says Imran khan

  • జాతినుద్దేశించి ప్రసంగించిన ఇమ్రాన్
  • ఏ సూపర్ పవర్ కూడా భారత్‌ను శాసించలేదన్న పాక్ ప్రధాని
  • ఆరెస్సెస్ భావజాలమే భారత్, పాక్‌ను విడదీసిందని వ్యాఖ్య
  • దిగుమతి అయ్యే ప్రభుత్వాన్ని ఆమోదించనన్న ఇమ్రాన్ 
  • తన ప్రభుత్వ పతనాన్ని పండగ చేసుకుంటోందంటూ పాక్ మీడియాపై ఆగ్రహం 

భారత్‌పై ఇటీవల ప్రశంసలు కురిపిస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు అదే పనిచేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం, ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు, సుప్రీంకోర్టులో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు వంటి వాటితో మరిన్ని కష్టాల్లో కూరుకుపోయిన ఇమ్రాన్ గత రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు.

 ఈ సందర్భంగా భారత్‌పై మరోమారు ప్రశంసలు కురిపించారు. ఏ సూపర్ పవర్ కూడా భారత్‌ను శాసించలేదని అన్నారు. ఆరెస్సెస్ భావజాలమే అందుకు కారణమని భారత్‌ను, పాకిస్థాన్‌ను వేరు చేసింది కూడా అదేనని అన్నారు. భారత్ గురించి ఇతరుల కంటే తనకే ఎక్కువ తెలుసన్న ఇమ్రాన్.. పాకిస్థాన్‌కు కూడా స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని అన్నారు. భారత్‌ను చూసి స్వాభిమానాన్ని నేర్చుకోవాలన్నారు.

తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు అంతర్జాతీయంగా కుట్ర జరిగిందన్నారు. పాకిస్థాన్‌లో నామమాత్రపు వ్యక్తిని అధికారంలో కూర్చోబెట్టేందుకు విదేశీ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ, ఆర్థిక అస్థిరత ఉన్న దేశాల్లోనూ ఇలా జరగదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ప్రభుత్వ పతనాన్ని సంబరాలు చేసుకుంటోందంటూ పాక్ మీడియాపైనా ఇమ్రాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దిగుమతి అయ్యే ప్రభుత్వాన్ని తాను ఎట్టి పరిస్థితులలోనూ ఆమోదించననీ, ప్రజలందరూ ఆదివారం వీధుల్లోకి వచ్చి ఇందుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని కోరారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఖాసిం సూరి కొట్టివేయగా, ఈ వివాదాస్పద నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు తనను బాధించిందని, అయినప్పటికీ ఆ తీర్పును గౌరవిస్తానని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

  • Loading...

More Telugu News