Yati Narsinghanand: ఎక్కువమందిని కనకుంటే దేశంలో హిందువులు ఉండరు: ఘజియాబాద్ దస్నా దేవాలయం ప్రధాన అర్చకుడు యతి నర్సింగానంద్
- గతేడాది డిసెంబరులో యతి విద్వేష వ్యాఖ్యలు
- హిందూయేతరుడు ప్రధాని అయితే 20 ఏళ్లలో దేశంలో హిందువులు ఉండరని వ్యాఖ్య
- హిందూ మహిళల వెంటపడితే బహిరంగంగా అత్యాచారం చేస్తానన్న మరో సాధువు
గతేడాది డిసెంబరులో హరిద్వార్‌లో విద్వేష ప్రసంగం చేసి అరెస్ట్ అయిన ఘజియాబాద్ దస్నా దేవాలయం ప్రధాన అర్చకుడు యతి నరసింగానంద్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూయేతరుడు కనుక దేశానికి ప్రధాని అయితే మరో 20 ఏళ్లలో దేశంలో హిందువులే ఉండరని అన్నారు. కాబట్టి హిందువులు ఎక్కువమంది పిల్లల్ని కనాలని సూచించారు. అలాగే, హిందువులను మేల్కొల్పేందుకు ఆగస్టు 12 నుంచి 14 మధ్య మథు-గోవర్ధన్ ప్రాంతంలో ధర్మసంసద్ నిర్వహిస్తామని తెలిపారు. ఉనికి కోసం హిందువులు ఆయుధాలు కూడా చేపట్టాలని పిలుపునిచ్చారు.
మరోవైపు, ఉత్తరప్రదేశ్ సీతాపూర్‌లో స్థానిక ఆలయ పూజరి అయిన మహంత్ భజరంగ్‌దాస్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఖైరాబాద్‌లో ఎవరైనా ముస్లిం వ్యక్తి హిందూ మహిళ వెంటపడితే వారి కుమార్తెను, కోడలిని కిడ్నాప్ చేసి బహిరంగంగా అత్యాచారం చేస్తానని ప్రకటించి కలకలం రేపారు. ఆ వ్యాఖ్యల వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2న ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు ‘ఆల్ట్‌న్యూస్’ అనే వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబేర్ పేర్కొన్నారు. ఆయనపై పోలీసులు ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.
ఆయన ట్వీట్‌తో స్పందించిన సీతాపూర్ పోలీసులు మహంత్‌పై తాజాగా కేసు నమోదు చేశారు. మరోవైపు మహంత్ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ చైర్ పర్సన్ రేఖాశర్మ డీజీపీకి లేఖ రాశారు.