corona: రిజిస్ట్రేషన్ లేకుండానే కరోనా టీకా మూడో డోస్
- కోవిన్ లో నమోదు చేసుకోక్కర్లేదు
- రెండో డోసు తర్వాత 9 నెలల గ్యాప్ ఉండాలి
- ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ప్రికాషనరీ డోస్
కరోనా నివారణకు మూడో డోస్ టీకాను ఆదివారం (10వ తేదీ) నుంచి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించగా.. ఇందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీన్ని ప్రికాషనరీ డోస్ గా కేంద్రం అంటోంది. అంటే ముందు జాగ్రత్తగా తీసుకునేది.
మొదటి రెండు డోసుల టీకా ఏ కంపెనీది తీసుకున్నారో.. అదే టీకా డోస్ ఇప్పుడు కూడా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రకటించారు. రాష్ట్రాల ఆరోగ్య శాఖల కార్యదర్శులతో సమావేశం అనంతరం శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రికాషనరీ డోసు తీసుకునేందుకు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ అవసరం లేదని స్ఫష్టం చేశారు. ఇప్పటికే వారు మొదటి రెండు డోసులకు రిజిస్ట్రేషన్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారందరూ ప్రికాషనరీ డోస్ తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. కాకపోతే ప్రైవేటు హాస్పిటల్స్ లోనే ప్రికాషనరీ డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రజలు తమ పాకెట్ నుంచే ఖర్చు చేసుకోవాలి. కోవిషీల్డ్ ధర పన్నులకు ముందు రూ.600 అని సిరమ్ ఇనిస్టిట్యూట్ అధినేత అధర్ పూనవాలా ఇప్పటికే ప్రకటించారు. టీకాను ఇచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ చార్జీ కింద రూ.150 మించి తీసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది.