Pawan Kalyan: కడప రిమ్స్ లో పసికందుల మరణాలు కలవరపరుస్తున్నాయి: పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts to toddlers deaths in Kadapa RIMS

  • కడప రిమ్స్ లో ముగ్గురు శిశువుల మృతి 
  • ప్రభుత్వ వైఖరి సందేహాస్పదంగా ఉందన్న పవన్
  • సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు
  • ఇకనైనా ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరవాలని హితవు

కడప రిమ్స్ ఆసుపత్రిలో ముగ్గురు శిశువులు మరణించడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. కడప రిమ్స్ లో నవజాత శిశువులు ప్రాణాలు విడిచిన ఘటన మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. రిమ్స్ లో విద్యుత్ సరఫరా లేకపోవడం, వైద్య ఉపకరణాలు వినియోగించకపోవడం వల్లే తమ బిడ్డలు మృతి చెందారని కన్నవారు ఆరోపిస్తుండగా, ఆ తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళనకు ప్రభుత్వం ఇస్తున్న సమాధానం పలు సందేహాలకు తావిస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆర్డీవో చెబుతున్న మాటలను బట్టి చూస్తే, రిమ్స్ లో జరిగిన ఘటనను సర్దుబాటు చేసే తాపత్రయమే కనిపిస్తోందని విమర్శించారు. 

ఒక మానిటర్ తోనే 30 మంది చిన్నారులకు వైద్య సేవలు అందించారన్న తల్లిదండ్రుల ఆవేదనను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇలాంటి తీవ్ర ఘటనలు జరిగినప్పుడు తక్షణమే తనిఖీలు చేసి విచారణ జరపాల్సిన జిల్లా కలెక్టర్ ఎందుకు మౌనంగా ఉన్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అసలు, ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు.

ప్రభుత్వ పెద్దలకు మానవీయ కోణం లోపించడం అన్నదే వైద్య రంగంలో ఇలాంటి దుర్ఘటనలకు కారణం అవుతోందని పేర్కొన్నారు. కనీసం ఆసుపత్రులకు 24 గంటలు కరెంటు అందించలేని దుస్థితికి ఏపీ ప్రభుత్వం చేరుకోవడం అత్యంత దురదృష్టకరం అని విమర్శలు చేశారు. ఎండలు అధికమవడంతో విద్యుత్ వాడకం పెరిగిందని, అందుకే కోతలు విధిస్తున్నామని చెప్పడం పాలకుల చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. ఎండలు ఒక్క ఏపీలోనే మండిపోతున్నాయా... పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడులో ఎండలు లేవా? మరి అక్కడ విద్యుత్ కోతలు ఎందుకు లేవు? అని ప్రశ్నించారు. 

విపక్ష నేతలను దూషించడంలో ఉన్న శ్రద్ధలో కాస్తయినా విద్యుత్ రంగంపైనా, వైద్య రంగం అభివృద్ధి పైనా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఈ బాధలు తప్పేవని పవన్ కల్యాణ్ హితవు పలికారు. ఇకనైనా ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచి, ఆసుపత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన జనరేటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News