Imran Khan: ఇమ్రాన్ ఖాన్ పారిపోకుండా చూడండి: ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్
- పాక్ రాజకీయాల్లో కీలక మలుపు
- అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో ఇమ్రాన్ ఓటమి
- త్వరలో కొత్త ప్రభుత్వం
- ఇమ్రాన్ పేరు ఎగ్జిట్ కంట్రోల్ లిస్టులో చేర్చాలంటూ పిల్
పాకిస్థాన్ రాజకీయాలు మరో మలుపు తిరగడం తెలిసిందే. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ లో ఇమ్రాన్ ఖాన్ ఓడిపోవడంతో ఆయన ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే, ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ ఇస్లామాబాద్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలైంది.
తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని వీడే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజా పిల్ దాఖలైంది. ఇమ్రాన్ పేరును 'ది ఎగ్జిట్ కంట్రోల్ లిస్టు'లో చేర్చాలంటూ పిటిషనర్లు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ జాబితాలోకి పేరు ఎక్కితే, వారు దేశాన్ని విడిచి వెళ్లడం కుదరదు. తప్పనిసరిగా విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కాగా, పీఎంఎల్-ఎన్ ప్రధాని అభ్యర్థి షాబాజ్ షరీఫ్ స్పందిస్తూ, తాము కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడబోమని, అరెస్టులకు దిగబోమని స్పష్టం చేశారు. అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు ముందే అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఇమ్రాన్ ఖాన్ తదుపరి కార్యాచరణ ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.