Adimulapu Suresh: బావబావమరుదుల మధ్య దోబూచులాడిన మంత్రి పదవి... తిప్పేస్వామికి నిరాశ, పదవి నిలుపుకున్న ఆదిమూలపు
- ఏపీ కొత్త క్యాబినెట్ కోసం నిన్న తీవ్ర కసరత్తులు
- తొలుత జాబితాలో ఆదిమూలపు పేరు
- ఓ మాజీ మంత్రి అసహనం
- తెరపైకి తిప్పేస్వామి పేరు
- చివరి నిమిషంలో మళ్లీ మార్పు
- మంత్రిగా ఆదిమూలపు కొనసాగింపు
నిన్న ఏపీ కొత్త క్యాబినెట్ జాబితా మీడియాకు వెల్లడైన నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. చివరి నిమిషంలో ఆదిమూలపు సురేశ్ మంత్రిపదవి నిలుపుకున్నారు.
వాస్తవానికి జాబితా రూపొందించిన సమయంలో ఆదిమూలపు పేరు కూడా ఉంది. అయితే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ తాజా మాజీ మంత్రి అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఆదిమూలపు పేరును తప్పించిన వైసీపీ అధినాయకత్వం, ఆదిమూలపు సురేశ్ బావ తిప్పేస్వామి (మడకశిర ఎమ్మెల్యే) పేరును జాబితాలో చేర్చింది. మీడియాలో కూడా తిప్పేస్వామికి మంత్రి పదవి అంటూ జోరుగా ప్రచారం జరిగింది.
కానీ, ప్రకాశం జిల్లాకు మంత్రి పదవి లేకుండా పోతుందన్న సమీకరణాలు తెరపైకి రావడంతో ఆదిమూలపు సురేశ్ నే కొనసాగించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఏమైనా, తిప్పేస్వామికి మంత్రిపదవి కాసేపు ఆనందం కలిగించినా, ఆ వెంటనే అది ఆవిరైంది. కాగా, తిప్పేస్వామికి మంత్రి పదవి కోసం తాజా మాజీ మంత్రి బాలినేని ప్రయత్నించినట్టు వార్తలు వస్తున్నాయి.