Palnadu: ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యరపతినేని అనుచరులు.. పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత
- ఈ నెల 13న యరపతినేని బర్త్ డే
- పిగుగురాళ్లలో భారీ కటౌట్ పెట్టిన టీడీపీ శ్రేణులు
- తొలగించాలన్న మునిసిపల్ అధికారులు
- పోలీసులు, అనుచరుల మధ్య తోపులాట
ఏపీలోని పల్నాడు ప్రాంతంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడు పరిధిలోని పిడుగురాళ్లలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల్లో కొందరు వ్యక్తులు పోలీసుల తీరును నిరసిస్తూ ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 13న యరపతినేని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అనుచరులు పిడుగురాళ్లలో ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల మునిసిపల్ అధికారులు ఆ కటౌట్‌ను తొలగించాలని యరపతినేని అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు యరపతినేని అనుచరులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసు బలగాలతో కలిసి మునిసిపల్ అధికారులు కటౌట్‌ను తొలగించేందుకు యత్నించారు.
దీంతో అక్కడకు చేరుకున్న యరపతినేని అనుచరులు పోలీసులు, మునిసిపల్ అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు, అధికారులను నిలువరించే యత్నంలో భాగంగా యరపతినేని అనుచరుల్లో కొందరు వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పోలీసులు వెనుదిరగకపోతే నిప్పు అంటించుకుంటామని హెచ్చరించారు. ఊహించని ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.