Balineni Srinivasa Reddy: జగన్‌తో 2 గంటల భేటీ తర్వాత బాలినేని ఏమన్నారంటే..!
- వైఎస్ కుటుంబానికి మేం సన్నిహితులం
- సీఎం జగన్ కు విధేయులం
- సురేశ్‌తో నాకు విభేదాలు లేవు
- సీఎం అభీష్టం మేరకు పనిచేస్తానన్న బాలినేని
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చోటు దక్కని తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు ఆయన అలకను తీర్చేందుకు వైసీపీ కీలక నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నెరపిన బుజ్జగింపులు ఎట్టకేలకు విజయవంతం కాగా.. సోమవారం సాయంత్రం సీఎం జగన్‌తో బాలినేని భేటీ అయ్యారు. సజ్జలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, ఎమ్మెల్యే కరణం బలరాంల సమక్షంలో రెండు గంటల పాటు జరిగిన వీరి భేటీ కాసేపటి క్రితం ముగిసింది.
భేటీ అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన బాలినేని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, 'వైఎస్ కుటుంబానికి మేం సన్నిహితులం. సీఎం జగన్ కు విధేయులం. పదవి లేకపోతే కొంచెం ఫీల్ ఉంటుంది. అంతే తప్పించి రాజీనామా దిశగా నాపై జరుగుతున్న ప్రచారాలు సరికాదు. వాటిని ఖండిస్తున్నా. మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో నాకు విభేదాలు లేవు. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తా. నేనెప్పుడూ మంత్రి పదవి కోసం పాకులాడలేదు. మంత్రి పదవిని ఆ రోజే వదిలేశాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ వైసీపీ' అన్నారు.