BJP: పెట్రో ధరలు తగ్గించాలన్న బీజేపీ ఎంపీ.. కారణం కూడా చెప్పిన వైనం
- ఈ ఏడాది జనవరి 31 నాటి ధరలను ప్రస్తావించిన ఎంపీ
- ముడి చమురుతో పెట్రోల్, డీజిల్ ధరలను పేర్కొన్న సుబ్రహ్మణ్య స్వామి
- ముడి చమురు ధరలు తగ్గినందున పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
దేశంలో ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకా ధరల పెంపును పట్టించుకోనట్టే కనిపించిన కేంద్ర ప్రభుత్వం... ఎన్నికలు ముగియగానే ఉక్రెయిన్, రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలను చూపుతూ పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతంగా పెంచేసింది. అయితే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పుడు తగ్గించాలంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి విన్నవించారు.
ఈ ఏడాది జనవరి 31న పెట్రోల్,. డీజిల్ ధరలు ఏ మేర ఉన్నాయో..ఆ మేర ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరాయించారు. ఈ ఏడాది జనవరి 31న అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 100 డాలర్లకు దిగువన ఉన్నాయని చెప్పిన స్వామి.. ఇప్పుడు కూడా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు అంతే ఉన్నాయని వెల్లడించారు. ఈ కారణంగానే ఈ ఏడాది జనవరి 31న ఉన్న ధరల మేరకే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.