Sri Lanka: మందుల్లేవ్, శస్త్రచికిత్సల్లేవ్... శ్రీలంకలో గాల్లో దీపంలా రోగుల పరిస్థితి!
- శ్రీలంకలో తీవ్ర సంక్షోభం
- అప్పుల కుప్పగా శ్రీలంక
- అత్యవసర ఔషధాలకు తీవ్ర కొరత
- చేతులెత్తేసిన శ్రీలంక ఆరోగ్య శాఖ
శ్రీలంకలో సామాన్య పౌరుల పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక సర్కారు... నామమాత్రంగా నెట్టుకొస్తోంది. ప్రభుత్వానికి, సాధారణ జనజీవనానికి మధ్య ఉన్న సంబంధం మిణుకుమిణుకుమంటోంది. శ్రీలంకలో ప్రాణాంతక జబ్బులతో బాధపడుతున్న వారి పరిస్థితి అత్యంత బాధాకరంగా మారింది.
గతంలో శ్రీలంకలో ప్రభుత్వమే ప్రజలకు వైద్యం అందించేది. క్యాన్సర్, కిడ్నీ రోగులకు అవసరమైన ఎంతో ఖరీదైన ఇంజెక్షన్లు కూడా ప్రభుత్వం నుంచే ఉచితంగా లభించేవి. రోజాన్నే వైట్ అనే శ్రీలంక మహిళ ఎనిమిదేళ్ల కిందట క్యాన్సర్ బారినపడింది. ఈ క్రమంలో ఆమె ఒక కిడ్నీ కూడా కోల్పోయింది. గత మే నుంచి ఆమెకు బెవాసిజుమాబ్ అనే ఇంజక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు సంక్షోభం తలెత్తడంతో ప్రభుత్వం ఖరీదైన ఔషధాలు ఇవ్వడం మానేసింది.
ప్రైవేటు మార్కెట్లో బెవాసిజుమాబ్ ఇంజక్షన్ ఖరీదు 1,13,000 శ్రీలంక రూపాయలు. రోజాన్నే వైట్ వద్ద అంత డబ్బు లేదు. ఆమె ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు ఎప్పుడో అయిపోయింది. ఈ దుస్థితి రోజాన్నే వైట్ ఒక్కరికే కాదు... శ్రీలంక వ్యాప్తంగా ఎంతోమందికి ఎదురవుతోంది. అత్యవసర ఔషధాల్లేక రోగుల ఇక్కట్లు వర్ణనాతీతం.
అంతేకాదు, శస్త్రచికిత్సలకు కూడా తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. సర్జరీలకు అవసరమైన ఉపకరణాల కొరత తీవ్రంగా ఉండడమే అందుకు కారణం. ఎంతో అత్యవసరమైతే తప్ప శస్త్రచికిత్సల జోలికి వెళ్లడంలేదు. కొలంబోలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. శ్రీలంక ఆరోగ్య మంత్రిత్వ శాఖను దీనిపై వివరణ కోరేందుకు అంతర్జాతీయ మీడియా ప్రయత్నించగా, అవతలివైపు నుంచి స్పందనే లేదు.
తాజా పరిణామాల పట్ల శ్రీలంక మెడికల్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. రానున్న రోజుల్లో అత్యవసర చికిత్సలు ఆపేస్తే జనాలు పిట్టల్లా రాలిపోవడం ఖాయమని పేర్కొంది. ఈ మేరకు రాజపక్స ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది.