Narendra Modi: డబ్ల్యూటీఓ అనుమతిస్తే రేపటి నుంచే ప్రపంచానికి ఆహారం అందిస్తాం: మోదీ

Modi said if WTO agree India will supply food to the world

  • బైడెన్ తో మోదీ వర్చువల్ భేటీ
  • ఉక్రెయిన్ పరిస్థితి నేపథ్యంలో పలు అంశాలపై చర్చ
  • ప్రపంచదేశాలు ఆహార కొరత ఎదుర్కొంటాయన్న మోదీ
  • మోదీ అభిప్రాయాలతో ఏకీభవించిన బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ సమావేశం నిర్వహించడం తెలిసిందే. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచదేశాలు ఆహార సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉందని బైడెన్ తో పేర్కొన్నానని మోదీ వెల్లడించారు. చమురు, ఎరువులు సమకూర్చుకోవడం సమస్యాత్మకంగా మారిందని వివరించినట్టు తెలిపారు. ఆహార సమస్య కొత్తగా కలవరపాటుకు గురిచేస్తోందని పేర్కొన్నారు. 

అయితే, ప్రపంచదేశాలకు ఆహారాన్ని అందించే సామర్థ్యం భారత్ కు ఉందని తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అనుమతిస్తే రేపటి నుంచే ఆహారం అందిస్తామని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశ ప్రజలకు సరిపోయేంత ఆహారం అందుబాటులో ఉందని, అదే సమయంలో ప్రపంచదేశాల కడుపు నింపేంత ఆహారం కూడా తమ వద్ద ఉందని వివరించారు. ఆ మేరకు భారత రైతులు సన్నద్ధంగా ఉన్నారని మోదీ స్పష్టం చేశారు. 

ఏదేమైనా, అంతర్జాతీయ చట్టాలను పాటించాల్సి ఉందని, దీనిపై డబ్ల్యూటీఓ ఎప్పుడు అనుమతిస్తుందో తెలియదని పేర్కొన్నారు. గుజరాత్ లోని శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ ఏర్పాటు నేపథ్యంలో జరిగిన కార్యక్రమంలో మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచదేశాలు ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందన్న తమ ఆలోచన పట్ల బైడెన్ కూడా ఏకీభవించారని మోదీ తెలిపారు.

  • Loading...

More Telugu News