Uttar Pradesh: యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ స్వీప్.. మోదీ గడ్డపై మాత్రం ఓటమి!
- 36 ఎమ్మెల్సీ సీట్లకు జరిగిన ఎన్నికలు
- 30కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిపత్యం
- వారణాసిలో గెలిచిన మాఫియా డాన్ భార్య
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. యూపీ శాసనమండలిలో 100 సీట్లు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 36 సీట్లకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ రోజు జరుగుతున్న కౌంటింగ్ లో ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయి. వీటిలో 30 సీట్లలో బీజేపీ గెలుపు ఖాయమని తేలిపోయింది. ఈ ఫలితాలు అధికారికంగా వెలువడిన తర్వాత యూపీ శాసనమండలిలో సైతం బీజేపీ సభ్యులు భారీగా పెరగనున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి స్థానంలో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. మాఫియా డాన్, స్థానికంగా ఎంతో పట్టు ఉన్న బ్రిజేశ్ సింగ్ భార్య అన్నపూర్ణ సింగ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. బ్రిజేశ్ సింగ్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోవడం గమనార్హం.