Chennai Superkings: చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళైనా బోణీ కొట్టేనా...!

Chennai Superkings wants to register first win in ongoing IPL

  • ఐపీఎల్ లో నేడు బెంగళూరు వర్సెస్ చెన్నై
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు
  • ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన చెన్నై
  • 4 మ్యాచ్ ల్లోనూ ఓటమి
  • తొలి గెలుపు కోసం ఆరాటం

నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టు చెన్నై సూపర్ కింగ్స్. గత సీజన్ లోనూ ఇదే జట్టు చాంపియన్ గా నిలిచింది. కానీ, తాజా సీజన్ లో ఆ జట్టు అత్యంత చెత్త ఆటతీరుతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడితే, నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓటమిపాలైంది. 

ఎన్నో ఆశలతో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రవీంద్ర జడేజాకు ఏదీ కలిసి రావడంలేదు. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుండగా, జడేజా టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ టోర్నీలో ఛేజింగ్ చేసిన జట్లే ఎక్కువగా గెలుస్తున్న నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో చెన్నై ఏంచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. 

వరుసగా 4 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా కోల్పోయిన చెన్నై.. కనీసం టోర్నీలో బోణీ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 మ్యాచ్ ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 

ఈ మ్యాచ్ కోసం బెంగళూరు జట్టులో జోష్ హేజెల్ వుడ్, సుయాష్ ప్రభుదేశాయ్ లకు చోటు కల్పించారు. చెన్నై జట్టు ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతోంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ మైదానం వేదికగా నిలుస్తోంది.
.

  • Loading...

More Telugu News