Nampally Court: గంజాయి కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు.. దోషికి 20 ఏళ్ల శిక్ష
- 2020లో 1,427 కేజీల గంజాయి తరలిస్తూ పట్టుబడిన నదీమ్
- తాజాగా తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం
- లక్ష రూపాయల జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో మూడేళ్ల జైలు
గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో నిందితుడిని దోషిగా తేల్చిన నాంపల్లి కోర్టు అతడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ నిన్న సంచలన తీర్పు వెలువరించింది. ఆగస్టు 2020లో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై పంతంగి టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ట్రక్కులో 1,427 కేజీల గంజాయి లభించింది.
ఈ కేసులో ఆ తర్వాతి రోజు నిందితుడైన వాహనం డ్రైవర్ నదీమ్ (25)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అరెస్ట్ చేసింది. తాజాగా ఈ కేసులో నదీమ్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే అదనంగా మరో మూడేళ్లపాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చింది.