Vitamins: రోజువారీగా అందాల్సిన ముఖ్యమైన విటమిన్స్, మినరల్స్ ఇవే..!

Vitamins and Minerals One Should Take Daily For Good Health

  • శరీర జీవక్రియలకు వీటి అవసరం ఎంతో ఉంది
  • శరీరానికి ఇవి ముఖ్యమైన పోషకాలు 
  • క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లోపం ఉండొద్దు
  • జింక్, ఫొలేట్, బి12 కూడా కీలకమైనవే

శరీర జీవక్రియలు సాఫీగా సాగేందుకు విటమిన్స్, మినరల్స్ పాత్ర ఉంటుంది. ఇవి శరీరానికి ముఖ్యమైన పోషకాలుగా పనిచేస్తాయి. వేర్వేరు రకాల ఆహారంతోపాటు, కూరగాయలు, పండ్ల ద్వారా ఈ కీలకమైన విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందేలా చూసుకోవచ్చు. మిగిలినవి అవసరం లేదని కాదు. కానీ, ఆరోగ్యకరంగా ఉండాలంటే వీటి లోపం లేకుండా చూసుకోవాలి. 

విటమిన్ డి
క్యాల్షియం ఎముకల పటుత్వానికి అవసరమని తెలిసిందే. మరి ఆహారం లేదా సప్లిమెంట్ల (మాత్రలు)లోని క్యాల్షియాన్ని శరీరం సంగ్రహించాలంటే విటమిన్ డి తప్పకుండా కావాలి. విటమిన్ డి లోపం ఉన్న వారికి క్యాల్షియం లోపం కూడా ఉన్నట్టుగానే భావించాలి. విటమిన్ డి, క్యాల్షియం లోపంతో ఎముకల నొప్పులు, వెన్నెముక నొప్పి, జుట్టు రాలిపోవడం, అనారోగ్యానికి గురయ్యే రిస్క్ ఉంటుంది.

మెగ్నీషియం
ఇది కూడా ముఖ్యమైన పోషకం. ఆహారం లేదంటే సప్లిమెంట్ల రూపంలో అయినా కావాల్సిన మోతాదులో శరీరానికి అందించాలి. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియంతోపాటు మెగ్నీషియం కూడా అంతే అవసరం. శక్తి తయారీకి ఇది కావాలి. నాడీ వ్యవస్థ సాఫీగా పనిచేసేందుకు, నిద్ర సమస్యలు రాకుండా ఉండేందుకు, కండరాలు, నరాల పనితీరు సరిగ్గా ఉండేందుకు, రక్తపోటు నియంత్రణకు మెగ్నీషియం కావాల్సి ఉంటుంది.

క్యాల్షియం
కండరాల పనితీరు సజావుగా సాగేందుకు, రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు, హార్మోన్ల ఉత్పత్తికి, ఎముకలు గట్టిగా ఉండేందుకు, పళ్లు పటిష్ఠంగా ఉండేందుకు, ఆస్టియో పోరోసిస్ బారిన పడకుండా ఉండేందుకు కాల్షియం సాయపడుతుంది. 

ఐరన్
ఇది మల్టీ విటమిన్. అందరికీ ఒకే పరిమాణంలో ఐరన్ అవసరం ఉండదు. పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. రుతుక్రమంలో ఉన్న స్త్రీలు, గర్భిణులకు ఐరన్ అవసరం ఎక్కువ. శాకాహారులు, వెగాన్స్ తప్పకుండా ఐరన్ లోపం ఉందేమో ఏడాదికోసారి అయినా పరీక్షించుకోవాలి. లోపం ఉంటే దాన్ని భర్తీ చేసే ఆహారం, వైద్యుల సూచనతో పరిమిత కాలం పాటు ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవాలి. 

జింక్
జింక్ చేసే మేలు చాలా ఉంది. దీన్ని స్వల్ప మోతాదులో తీసుకుంటే సరిపోతోంది. పురుషులకు 11 మిల్లీగ్రాములు, మహిళలకు 8 మిల్లీ గ్రాముల మోతాదు చాలు. పౌల్ట్రీ ఉత్పత్తులు తీసుకునే వారికి జింక్ తగినంత అందుతుంది. శాకాహారులు బీన్స్, నట్స్, ముడి ధాన్యాలు తినడం ద్వారా జింక్ తగినంత అందేలా చూసుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉండేందుకు జింక్ సాయపడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. జలుబు వేగంగా తగ్గడానికి కూడా ఇది అవసరమే. క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 

ఫొలేట్
ఫోలిక్ యాసిడ్ అన్నది గర్భిణులుగా ఉన్న సమయంలో సప్లిమెంట్ల రూపంలో వైద్యులు సూచిస్తుంటారు. పిండం ఎదుగుదలకు ఇది అవసరం. పుట్టుకతో వచ్చే లోపాలను ఇది అరికడుతుంది. ఒత్తిడిలో ఉన్నవారు, ఇన్ ఫ్లమ్మేషన్ తో బాధపడుతున్న వారికి ఫొలేట్ లోపం ఉన్నట్టు భావించొచ్చు.

విటమిన్ బి12
ఇది అత్యంత ముఖ్యమైన విటమిన్. నరాలు, రక్త కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైనది. నాడీ మండల వ్యవస్థ, మెదడు చక్కని పనితీరుకు సాయపడుతుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరం. బి12కు కొబాలమిన్ అనే పేరు కూడా ఉంది. డీఎన్ఏ సరిగ్గా ఉండడానికి, శక్తి తయారీకి, కంటి ఆరోగ్యానికి కూడా ఇది కావాలి. 

  • Loading...

More Telugu News