TDP: ఏపీలో ఆర్టీసీ చార్జీల పెంపుపై రేపటి నుంచి టీడీపీ నిరసనలు
- ఆర్టీసీ చార్జీల పెంపుపై చంద్రబాబు ఆగ్రహం
- ఇప్పటికే రెండు సార్లు పెంచారని విమర్శ
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకై పార్టీ శ్రేణులకు పిలుపు
ఏపీలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచుతూ బుధవారం నాడు వైసీపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా గురువారం నుంచి ఏపీ వ్యాప్తంగా నిరసనలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఓ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేంద్రాల్లోని ఆర్టీసీ బస్టాండ్ల వద్ద నిరసనలు తెలపాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బాదుడే బాదుడులో భాగంగా జగన్ సర్కారు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలను పెంచిందన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ చార్జీల పెంపు ఇది రెండోదని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలను ఇష్టారాజ్యంగా పెంచేసిన జగన్ సర్కారు... తాజాగా ఆర్టీసీ చార్జీలను పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.