Ganta Srinivasa Rao: ఎన్నికల ముందు టీడీపీలోకి వలసలు పెరుగుతాయి: గంటా శ్రీనివాసరావు
- మంత్రి పదవులు ఇవ్వలేదని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇప్పుడే చూస్తున్నామన్న గంటా
- సీఎం విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తే సంబంధిత మంత్రి రాకపోవడమేమిటని ప్రశ్న
- బీసీలు ఎప్పటికీ టీడీపీ పక్షమే అని స్పష్టీకరణ
సీఎం జగన్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ బలవంతుడిగా కనిపించినా... ఓ బలహీన నాయకుడు అని అభివర్ణించారు. కొత్త క్యాబినెట్ కూర్పుతో అది స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
మంత్రి పదవులు ఇవ్వలేదని దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం ఇప్పుడే చూస్తున్నాం అని అన్నారు. తన 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో సీఎం దిష్టిబొమ్మలు, టైర్లు తగలబెట్టడం ఇదే ప్రథమం అన్నారు. సీఎం విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తే సంబంధిత మంత్రి రాకపోవడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందు మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీలు వైసీపీని నమ్ముతారా? అని ప్రశ్నించారు. బీసీలు ఎప్పుడూ టీడీపీ పక్షమేనని గంటా ఉద్ఘాటించారు. ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీకి బీసీలను ఎవరూ దూరం చేయలేరని వ్యాఖ్యానించారు. ఎన్నికలకు ఐదారు నెలల ముందు నుంచి పొత్తులు, సర్దుబాట్లు ఉంటాయని వెల్లడించారు. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ టీడీపీలోకి వలసలు ఎక్కువవుతాయని గంటా స్పష్టం చేశారు.