Gaalivaana: జీ5లో దూసుకుపోతున్న మర్డర్ మిస్టరీ 'గాలివాన'.. అసలు కథ ఏమిటంటే..?

Gaalivaana web series streaming in ZEE5 OTT gets good response from audience
  • ప్రధాన పాత్రలు పోషించిన రాధిక, సాయికుమార్, చైతన్య కృష్ణ, చాందిని
  • శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్
  • అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించిన సుజాత సిద్ధార్థ్
రాధికా శరత్ కుమార్, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన 'గాలివాన' వెబ్ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. 

మర్దర్ మిస్టరీ, డ్రామా కథాంశంగా నిర్మితమైన 'గాలివాన' కథ వివరాల్లోకి వెళ్తే... కొత్తగా పెళ్లైన జంట అజయ్ వర్మ, గీత హానీమూన్ కు వెళ్తారు. హానీమూన్ నుంచి రాగానే హత్యకు గురవుతారు. తన కూతురు, అల్లుడు హత్యకు గురయ్యారనే వార్తతో కొమరాజు (సాయికుమార్), సరస్వతి (రాధిక) షాక్ కు గురవుతారు. సరస్వతి బాధతో కుంగిపోతూ  ఉంటుంది. 

ఈ క్రమంలో గాయపడి ఉన్న శ్రీను అనే అపరిచిత వ్యక్తి వారి ఇంటి వద్దకు వస్తాడు. అయితే అజయ్ వర్మ అన్న మార్తాండ్ (చైతన్య కృష్ణ) సూచన మేరకు... పోలీసులు వచ్చేంత వరకు శ్రీనుని కొమరాజు ఇంటి వద్ద ఉన్న పశువుల కొట్టంలో ఉంచాలని వారు నిర్ణయించుకుంటారు. అజయ్, గీతలను చంపింది శ్రీనే అనే అనుమానం వారికి వస్తుంది. దీంతో, అక్కడున్న అందరూ శ్రీనును చంపేద్దామనుకుంటారు. అయితే అజయ్ వర్మ సోదరి శ్రావణి (చాందిని చౌదరి) వారిని ఆపుతుంది. ఆ రాత్రికి ఇరు కుటుంబాలు కొమరాజు ఇంట్లోనే గడుపుతాయి. 

అనంతరం, అందరూ పడుకున్న తర్వాత గీత తమ్ముడు శ్రీకాంత్ (అర్మాన్) పశువుల కొట్టంలోకి వెళ్తాడు. అనంతరం తెల్లారిన తర్వాత శ్రావణి పశువుల కొట్టంలోకి వెళ్లి షాక్ కు గురవుతుంది. అక్కడ శ్రీను మృతి చెంది ఉంటాడు. వెంటనే మిగిలిన అందరూ కూడా అక్కడకు వెళ్తారు. ఈ సందర్భంగా, మనలో ఉన్నవారిలోనే ఒకరు శ్రీనును చంపేశారని శ్రావణి అంటుంది. 

మరోవైపు, వైజాగ్ కు చెందిన నందిని (నందిని రాయ్) అనే మహిళా ఎస్సైకు అజయ్ వర్మ, గీతల మర్డర్ కేసు విచారణ బాధ్యతలను అప్పగిస్తారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తు కోసం నందిని వస్తుంది. ఈ పరిస్థితుల్లో శ్రీను శవాన్ని దాచి ఉంచడానికి ఇరు కుటుంబాలు ఎంతో శ్రమిస్తాయి. ఇదే సమయంలో శ్రీనును ఎవరు హత్య చేశారనే విషయంలో ఇరు కుటుంబాల వ్యక్తులు ఒకరినొకరు అనుమానించుకునే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతూ, అనూహ్యంగా కొనసాగుతుంది. చివరకు హంతకుడు ఎవరు? కుటుంబంలోనే హంతకులు ఉన్నారా? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వెబ్ సిరీస్ ను చూడాల్సిందే. 

ఈ వెబ్ సిరీస్ లో రాధిక, సాయి కుమార్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, అశ్రిత వేముగంటి, నందిని రాయ్, తాగుబోతు రమేశ్, శరణ్య ప్రదీప్, అర్మాన్, శ్రీలక్ష్మి తదితరులు నటించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించగా... సమీర్ గోగేట్, శరత్ మరార్ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను సుజాత సిద్ధార్థ్ వ్యవహరించారు. గౌర హరి సంగీతాన్ని అందించారు.
Gaalivaana
Web Series
ZEE5
Story

More Telugu News