Roja: నిజమైన అంబేద్కర్ వాది అంటే సీఎం జగనే!: రోజా
- అంబేద్కర్ జయంతి సందర్భంగా రోజా నివాళులు
- అంబేద్కర్ స్ఫూర్తిగా సమసమాజాన్ని స్థాపించిన ముఖ్యమంత్రి జగన్ అంటూ ప్రశంసలు
- అంబేద్కర్ బతికుంటే జగన్ ను అభినందించేవారని వ్యాఖ్య
ఇవాళ భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విలసిల్లుతోందంటే అందుకు ముఖ్య కారకులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని ఏపీ మంత్రి రోజా కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తన చాంబర్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు.
ఓ లౌకికవాద దేశంగా భారత్ వర్ధిల్లుతోందని, దేశంలో అన్ని మతాలు, కులాలు, వర్గాలు, ప్రాంతాలకు చెందినవారు కలిసిమెలిసి జీవించడానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంతగానో దోహదపడుతోందని వివరించారు. అంబేద్కర్ ఏ ఒక్క కులానికో, ఏ ఒక్క వర్గానికో చెందినవారు కాదని, ఆయన దేశం మొత్తానికి చెందిన వ్యక్తి అని కీర్తించారు. బడుగు బలహీనవర్గాలందరూ బాగుండాలని, సమసమాజం ఏర్పడాలని ఆకాంక్షించిన వ్యక్తి అంబేద్కర్ అని పేర్కొన్నారు.
"ఈ రోజున నేను గర్వంగా చెప్పగలను. నిజమైన అంబేద్కర్ వాది అంటే సీఎం జగనే. అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని, ఆయన కోరుకున్న సమసమాజాన్ని స్థాపించిన ఏకైన ముఖ్యమంత్రి జగన్. క్యాబినెట్ నుంచి గ్రామస్థాయిలో వలంటీర్ వ్యవస్థ వరకు చూస్తే.... బడుగు బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వారికి ఇస్తున్న అవకాశాలు, అందిస్తున్న పథకాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవలి క్యాబినెట్ కూర్పులో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం ఇవ్వడం చూస్తే, ఇవాళ గనుక అంబేద్కర్ బతికుంటే జగన్ గారిని తప్పకుండా అభినందించి ఉండేవారు. ఎప్పుడైతే అట్టడుగు వర్గాల వారిని కూడా సమంగా గౌరవిస్తూ, వారికి అన్ని విధాలుగా అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తామో అదే అంబేద్కర్ కు నిజమైన నివాళి. పైనుంచి అంబేద్కర్ కూడా సంతోషిస్తారు" అంటూ రోజా వివరించారు.