Ratan Tata: "ఆర్ఎస్ఎస్ ఆసుపత్రిలో హిందువులకే వైద్యం చేస్తారా...?" అని రతన్ టాటా అడిగిన వేళ...!

When Ratan Tata asked only Hindus can be treated in RSS Hospital

  • పూణేలో నేడు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో గడ్కరీ
  • గతంలో జరిగిన సంఘటనను వివరించిన కేంద్రమంత్రి 
  • ఆర్ఎస్ఎస్ అగ్రనేత పేరిట ఔరంగాబాద్ లో ఆసుపత్రి నిర్మాణం 
  • ప్రారంభానికి రతన్ టాటాను ఆహ్వానించిన నాటి రాష్ట్ర మంత్రి గడ్కరీ  
  • రతన్ టాటా సందేహాన్ని తీర్చిన వైనం  

భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా గతంలో తనను అడిగిన ఓ ప్రశ్న గురించి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు. గడ్కరీ నేడు పూణేలోని సిన్హాబాద్ ప్రాంతంలో ఓ చారిటబుల్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. 

"గతంలో నేను  మహారాష్ట్రలో శివసేన-బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాను. ఆ సమయంలో ఔరంగాబాద్ లో కొత్తగా ఆసుపత్రి నిర్మించారు. ఆ ఆసుపత్రికి దివంగత ఆర్ఎస్ఎస్ అగ్రనేత కేబీ హెడ్గేవార్ పేరు పెట్టారు. అయితే ఆ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రతన్ టాటాను పిలుద్దామని ఓ ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు నాకు సూచించారు. అంతేకాదు, రతన్ టాటాను ఆహ్వానించే బాధ్యతను నాకు అప్పగించారు. దాంతో రతన్ టాటాకు విషయం చెప్పాను. ఆయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చేందుకు అంగీకరించడంతో, స్వయంగా వెళ్లి తోడ్కొని వచ్చాను. 

ఆసుపత్రికి మరికొంతసేపట్లో చేరుకుంటామనగా, రతన్ టాటా నన్నో ప్రశ్న అడిగారు. ఈ ఆసుపత్రిలో కేవలం హిందువులకే వైద్యం చేస్తారా? అని ప్రశ్నించారు. అలా ఎందుకు అనుకుంటున్నారు? అని అడిగాను. ఈ ఆసుపత్రి ఆర్ఎస్ఎస్ కు చెందినది కదా? అని ఆయన బదులిచ్చారు. దాంతో ఆయనకు ఆసుపత్రి ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాన్ని వివరించాను. 

ఈ ఆసుపత్రి అన్ని వర్గాల వారికీ చెందినదని చెప్పాను. మతాల ఆధారంగా ఇక్కడ వివక్ష చూపించడం జరగదని తెలిపాను. దాంతోపాటు ఆసుపత్రి గురించి మరికొన్ని విషయాలు కూడా వివరించడంతో రతన్ టాటా ఎంతో సంతోషించారు" అంటూ నితిన్ గడ్కరీ నాటి సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News