Kishan Reddy: కేసీఆర్ ఎవరినీ కలవరు.. డైనింగ్ టేబుల్ పై ఆయన కుటుంబాన్ని మాత్రమే కలుస్తారు: కిషన్ రెడ్డి
- ఆయుష్మాన్ భారత్ పథకానికి కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోందన్న కిషన్ రెడ్డి
- పంట బీమా పథకాన్ని కూడా అడ్డుకుంటున్నారని విమర్శ
- రాష్ట్రంలో కేసీఆర్ పోవడం, బీజేపీ రావడం ఖాయమన్న కేంద్రమంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పేద ప్రజలకు అండగా ఉండాలని ప్రధాని మోదీ ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల విలువైన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొస్తే... ఆ పథకానికి కేసీఆర్ సర్కారు మోకాలడ్డుతోందని అన్నారు. రైతుల కోసం సమగ్రమైన పంట బీమా పథకాన్ని తీసుకొస్తే దాన్ని కూడా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు చేపట్టిన 'ప్రజా సంగ్రామ యాత్ర'లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ మంత్రులను కలవరని, అధికారులను, అంగన్ వాడీ వర్కర్లను, ఉద్యోగులను, నిరుద్యోగులను ఎవరినీ కలవరని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా రారని అన్నారు. ప్రగతి భవన్ లోని డైనింగ్ టేబుల్ పై కూర్చొని కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కలుస్తారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం తామంతా ఉద్యమాలు చేసి, జైళ్లకు వెళ్లి రాష్ట్రాన్ని సాధించామని చెప్పారు. కేసీఆర్ మాత్రం రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి, నియంత, కుటుంబ పాలనను ఎండగడుతూ... ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం పోరాడేందుకే బండి సంజయ్ ఈ యాత్రను చేపట్టారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ పోవడం, బీజేపీ రావడం ఖాయమని అన్నారు.