Namrata: పెన్నీ పాటలో సితార... తెర వెనుక విశేషాలు వెల్లడించిన నమ్రత

Namrata says what happens behind Sithara appearance in Penny song
  • సర్కారు వారి పాట చిత్రంలో పెన్నీ పాట
  • యూట్యూబ్ లో దూసుకెళ్లిన హుషారైన సాంగ్
  • సితార స్టెప్పులకు అందరూ ఫిదా
  • తాము ఆశ్చర్యపోయామన్న నమ్రత
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల విడుదలైన పెన్నీ సాంగ్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కాగా, ఈ పాట వీడియోలో మహేశ్ బాబు కుమార్తె సితార వేసిన స్టెప్పులు అందరినీ ఆకట్టుకున్నాయి. అసలా వీడియో వెనుక కథను మహేశ్ బాబు అర్ధాంగి నమ్రత వెల్లడించారు. 

తమ ముద్దుల కుమార్తె సితారకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, తను శిక్షణ కూడా తీసుకుంటోందని తెలిపారు. అంతేకాకుండా, సితార తన డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలోనూ షేర్ చేస్తుంటుందని వివరించారు. సర్కారు వారి పాట చిత్రం నుంచి వచ్చిన కళావతి పాటకు సితార రీల్స్ వీడియో చేసిందని, ఆ వీడియోను సంగీత దర్శకుడు తమన్ కూడా చూశాడని నమ్రత వెల్లడించారు. ఆ పాటలో సితార పెర్ఫార్మెన్స్ తమన్ ను ముగ్ధుడ్ని చేసిందని, దాంతో పెన్నీ సాంగ్ లో సితారను చూపిద్దామని ప్రతిపాదించాడని తెలిపారు. 

అయితే మహేశ్, తాను భయపడ్డామని, ఓ సినిమా వీడియోలో డ్యాన్స్ చేయడం తనకు ఇదే తొలిసారి కావడంతో ఎలా చేస్తుందోనని కొంచెం ఆందోళనకు గురయ్యామని నమ్రత వివరించారు. అయితే, సితార డ్యాన్స్ స్టెప్పులు బాగుండి, వీడియో సరిగా వస్తేనే రిలీజ్ చేద్దామని ముందే అనుకున్నామని, ఒకవేళ వీడియో సరిగా రాకపోతే ఆ వీడియో క్యాన్సిల్ చేద్దామనుకున్నామని పేర్కొన్నారు. 

కానీ, పెన్నీ సాంగ్ లో సితార స్టెప్పులకు ఊహించని రీతిలో అద్భుతమైన స్పందన వచ్చిందని, సితార పెర్ఫార్మెన్స్ కు తాము కూడా ఆశ్చర్యపోయామని నమ్రత పుత్రికోత్సాహం ప్రదర్శించారు. అసలు, పెన్నీ సాంగ్ లో నువ్వు కూడా డ్యాన్స్ చేస్తున్నావు అని సితారతో మహేశ్ చెప్పగానే... సితార ఆనందంతో తబ్బిబ్బయిపోయిందని నమ్రత వెల్లడించారు. 

పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సర్కారు వారి పాట నుంచి ఇప్పటివరకు రెండు పాటలు విడుదల కాగా, రెండూ యూట్యూబ్ లో దూసుకెళ్లాయి. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టయిన్ మెంట్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ భారీ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Namrata
Mahesh Babu
Sithara
Penny Song
Thaman
Sarkaru Vaari Paata
Video Song

More Telugu News