Telangana: ప్రతి లెక్కా తేలుస్తామంటూ మంత్రికి రేవంత్ వార్నింగ్
- అక్రమ అరెస్టులు చేస్తున్నారన్న టీపీసీసీ చీఫ్
- పీడీ యాక్టులు పెట్టి వేధిస్తున్నారని ఫైర్
- కేసులతో రాజకీయం ఎక్కువ కాలం నడవదని పువ్వాడ అజయ్ కు చురక
టీఆర్ఎస్ సర్కార్ పై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ అవినీతి, అక్రమాలు, అసమర్థతపై పోరాడుతున్న కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులపై అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో ఓ కార్యకర్తపై పీడీ యాక్ట్ పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కేసులు పెట్టి చేసే రాజకీయం ఎక్కువ కాలం నడవదని మంత్రి పువ్వాడ అజయ్ గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రతి లెక్కా తేలుస్తామని రేవంత్ హెచ్చరించారు. కార్యకర్తలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.
ఖమ్మానికి చెందిన ఎండీ ముస్తఫా (39) అనే కాంగ్రెస్ కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రానైట్ వ్యాపారి అయిన ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ ఘటనపైనే రేవంత్ స్పందించి సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.