- నాకు పెద్ద లక్ష్యమే ఉంది
- చాలా కష్టపడి పనిచేస్తున్నాను
- భారత జట్టులో స్థానం కోసం కృషి చేస్తున్నా
- వెల్లడించిన ఆర్సీబీ ఆటగాడు
ఐపీఎల్ 15వ సీజన్ లో మంచి ఫామ్ కొనసాగిస్తున్న వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (36).. భారత జట్టులో స్థానం సంపాదించుకుందేందుకు తన వంతు కృషి చేస్తున్నట్టు చెప్పాడు. 2019 ప్రపంచకప్ సమయంలో చివరిగా భారత్ జట్టు తరఫున దినేష్ కార్తీక్ ఆడటమే. ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రాలేదు.
ఈ విడత ఐపీఎల్ సీజన్ లో బ్యాట్ తో దినేష్ కార్తీక్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ఆరు మ్యాచుల్లో ఆర్సీబీ కోసం 197 పరుగులు సాధించడమే కాకుండా, బ్యాటుతో మ్యాచ్ కు చక్కటి ముగింపునిస్తున్నాడు. ముఖ్యంగా ఢిల్లీపై విజయంలో దినేష్ కార్తీక్ పాత్రే కీలకం. 34 బంతుల్లో 66 పరుగులు పిండుకుని, 16 పరుగుల తేడాతో ఢిల్లీపై ఆర్సీబీ విజయానికి తోడ్పడ్డాడు.
‘‘నాకు పెద్ద లక్ష్యం ఉంది. చాలా కష్టపడి పనిచేస్తున్నాను. భారత్ కోసం ప్రత్యేకంగా ఏదైనా సాధించాలన్నదే నా లక్ష్యం. ఇది నా ప్రయాణంలో భాగమే. భారత జట్టులో చోటు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నా’’ అని దినేష్ కార్తీక్ తెలిపాడు. ఒత్తిడిలోనూ దినేష్ కార్తీక్ చక్కగా రాణిస్తుండడం అతడిలో పెరిగిన విశ్వాసాన్ని సూచిస్తోంది. ఐపీఎల్ లో తాజా ప్రదర్శనతో ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ్ కప్ కోసం భారత జట్టులో చోటు సంపాదించుకునే అవకాశాలు మెరుగుపడినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.