Mariupol City: ఆయుధాలు వదిలేసి లొంగిపోవాల్సిందే... ఉక్రెయిన్ సైనికులకు రష్యా అల్టిమేటం

Russia gives ultimatum to Ukraine soldiers in Mariupol city

  • ఉక్రెయిన్ నగరం మేరియుపోల్ పై రష్యా దాడులు
  • ఉక్రెయిన్ సైనికులకు డెడ్ లైన్ విధించిన రష్యా
  • మధ్యాహ్నం 1 గంట లోపు లొంగిపోవాలని హుకుం
  • ప్రాణాలకు హామీ ఇస్తామని స్పష్టీకరణ
  • మేరియుపోల్ పరిస్థితి దారుణంగా ఉందన్న జెలెన్ స్కీ

ఉక్రెయిన్ నగరం మేరియుపోల్ పై రష్యా సైన్యం పట్టు బిగించింది. మేరియుపోల్ నగరంలో ఉన్న ఉక్రెయిన్ సైనికులు ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలంటూ హుకుం జారీ చేసింది. ఈ మేరకు ప్రతి అరగంటకు ఓసారి ప్రకటన చేస్తోంది. లొంగిపోయిన వారిని యుద్ధఖైదీలుగా పరిగణిస్తామని, జెనీవా ఒప్పందం ప్రకారం అన్ని సదుపాయాలు వర్తింపజేస్తామని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ సైనికులకు ప్రాణహాని ఉండదని హామీ ఇచ్చింది. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు డెడ్ లైన్ విధించినట్టు రష్యా పేర్కొంది. 

కాగా, మేరియుపోల్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న ప్రతి ఒక్కరినీ నాశనం చేయడమే రష్యా లక్ష్యంగా కనిపిస్తోందని వెల్లడించారు. తాజా గణాంకాల ప్రకారం మేరియుపోల్ లో ప్రస్తుతం లక్ష మంది మిగిలున్నారు. రష్యా సైన్యం గుప్పిట చిక్కుకున్న తమ పౌరులను విడిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు జెలెన్ స్కీ తెలిపారు. 

ఉక్రెయిన్ కు భాగస్వామ్య పక్షాలు తక్షణమే ఆయుధాలు, యుద్ధ విమానాలను అందిస్తే మేరియుపోల్ ను కాపాడుకుంటామని అన్నారు. ఆ విధంగా వీలుకాకపోతే దౌత్య మార్గమే మిగిలుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News