Umran Malik: ఆఖరి ఓవర్లో 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్... పంజాబ్ 151 ఆలౌట్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్
- నిప్పులు చెరిగిన ఉమ్రాన్ మాలిక్
- 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మాలిక్
సన్ రైజర్స్ హైదరాబాద్ స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో విజృంభించాడు. చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ వికెట్ల పండగ చేసుకున్నాడు. ఆ ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ కశ్మీరీ యువకెరటం హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. కాగా, ఆ ఓవర్లో ఓ రనౌట్ కూడా ఉండడంతో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. మొత్తమ్మీద పంజాబ్ 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఆరంభంలోనే తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ (8) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఓపెనర్ ప్రభ్ సిమ్రాన్ (14), జానీ బెయిర్ స్టో (12) కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
అయితే, లియామ్ లివింగ్ స్టోన్ మరోసారి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ భారీస్కోరు దిశగా పయనిస్తున్నట్టే కనిపించింది. లివింగ్ స్టోన్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. అతడికి షారుఖ్ ఖాన్ (26) నుంచి సహకారం లభించింది. అయితే, షారుఖ్ ఖాన్, లివింగ్ స్టోన్ లను అవుట్ చేయడం ద్వారా భువనేశ్వర్ పంజాబ్ భారీ స్కోరు ఆశలకు కళ్లెం వేశాడు.
ఆ తర్వాత బౌలింగ్ కు దిగిన ఉమ్రాన్ మాలిక్ పంజాబ్ కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చివరి ఓవర్ బౌలింగ్ వేశాడు. ఆ ఓవర్లో పంజాబ్ ఒక్క పరుగు కూడా సాధించలేకపోయింది. ఓడియన్ స్మిత్ (13), రాహుల్ చహర్ (0), వైభవ్ అరోరా (0)లను అవుట్ చేసిన మాలిక్ సన్ రైజర్స్ శిబిరంలో ఆనందం నింపాడు. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అర్షదీప్ సింగ్ రనౌట్ కావడంతో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది.