SRH: తిరుగులేని సన్ రైజర్స్... వరుసగా నాలుగో విజయం

Sunrisers registered fourth consecutive win in IPL ongoing season

  • పంజాబ్ కింగ్స్ పై 7 వికెట్ల తేడాతో విన్
  • 18.5 ఓవర్లలో 152 పరుగుల టార్గెట్ ఛేదన
  • రాణించిన మార్ క్రమ్, త్రిపాఠి, పూరన్, అభిషేక్
  • పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో సన్ రైజర్స్

ఐపీఎల్ తాజా సీజన్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో ఓటమిపాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆపై జూలు విదిల్చింది. వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో జయభేరి మోగించింది. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ కు ఎదురులేకుండా పోయింది. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 152 పరుగుల విజయలక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ కేవలం 3 పరుగులు చేసి రబాడా బౌలింగ్ లో  అవుట్ కాగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ 31 పరుగులు చేసి సరైన ఆరంభాన్ని అందించాడు. 

వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేయగా, మిడిలార్డర్ లో అయిడెన్ మార్ క్రమ్, నికోలాస్ పూరన్ సమయోచితంగా బ్యాట్లు ఝుళిపిస్తూ మిగతా పని పూర్తి చేశారు. వీరిద్దరినీ అవుట్ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను పంజాబ్ ఫీల్డర్లు చేజార్చుకున్నారు. మార్ క్రమ్ 27 బంతుల్లో 41 పరుగులు, పూరన్ 30 బంతుల్లో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రాహుల్ చహర్ 2, కగిసో రబాడా ఒక వికెట్ తీశారు. 

కాగా, ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 4 విజయాలు సాధించింది.
టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్

ఇక, నేటి రెండో మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్ లో ఆడడంలేదు. అతడి స్థానంలో రషీద్ ఖాన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక మాథ్యూ వేడ్ స్థానంలో వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో అల్జారీ జోసెఫ్ ఆడుతున్నాడు. అటు, చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ రవీంద్ర జడేజా వెల్లడించాడు.

  • Loading...

More Telugu News