Peddireddi Ramachandra Reddy: విద్యుత్ కొరత దేశవ్యాప్తంగా ఉంది: మంత్రి పెద్దిరెడ్డి
- ఏపీ విద్యుత్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పెద్దిరెడ్డి
- రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పై వివరణ
- 235 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని వెల్లడి
కొత్త క్యాబినెట్ కూర్పులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి విద్యుత్ శాఖ కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. విద్యుత్ కొరత దేశవ్యాప్తంగా ఉందని అన్నారు.
ఏపీలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉందని వెల్లడించారు. అయితే 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. రోజుకు 55 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఉత్పన్నమవుతోందని మంత్రి పెద్దిరెడ్డి వివరించారు. పవర్ ఎక్చేంజిల్లోనూ విద్యుత్ లభ్యం కాని పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించారు.
డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని వచ్చే నెల నుంచి మరో 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్లలో 800 మెగావాట్ల చొప్పున ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. మే 1 నుంచి ఉత్పత్తి సాధారణ స్థాయికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా, వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.