Janasena: రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం?: పవన్ కల్యాణ్
- గుంటూరు జిల్లాలో సన్నకారు రైతు ఆత్మహత్య
- పాస్ బుక్కుల్లో తప్పులను సరిచేయకపోవడమే కారణం
- ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ పవన్ ప్రకటన విడుదల
- రెవెన్యూ శాఖ ఇప్పటికైనా మారాలంటూ సూచన
ఏపీలో రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా జొన్నలగడ్డ గ్రామానికి చెందిన సన్నకారు రైతు ఇక్కుర్తి ఆంజనేయులు ఆత్మహత్యను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ రైతు సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా నేడు ఓ ప్రకటన విడుదల చేశారు.
రైతు ఆంజనేయులు మృతికి కారణం అధికార యంత్రాంగమేనని పేర్కొన్న పవన్.. అధికారులు చేసిన తప్పిదాల వల్లే అతను బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఆంజనేయులు పేరిట ఉన్న 1.6 ఎకరాల పొలాన్ని పాస్ బుక్కుల్లో రికార్డు చేసిన అధికారులు ఓ తప్పు చేశారని, ఆ తప్పును సరిదిద్దాలని నాలుగేళ్లుగా ఆంజనేయులు తిరుగుతున్నా పట్టించుకోకుండా మరో తప్పు చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులు బలవన్మరణంతోనైనా అధికార యంత్రాంగం.. ప్రత్యేకించి రెవెన్యూ యంత్రాంగంలో మార్పు రావాలని పవన్ ఆకాంక్షించారు. ఆంజనేయులు ఆత్మహత్యకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా పవన్ డిమాండ్ చేశారు.