Prashant Kishor: దూకుడు పెంచిన పీకే.. సోనియాగాంధీతో మూడు రోజుల్లో రెండో సారి భేటీ!

Prashant Kishor Meets Sonia Gandhi

  • 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలపై చర్చ
  • త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కూడా వ్యూహాలు
  • గత శనివారం కూడా సోనియాను కలిసిన పీకే

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి భేటీ అయ్యారు. గత మూడు రోజుల్లో సోనియాను పీకే కలవడం ఇది రెండో సారి. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలతో పాటు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై వీరు చర్చలు జరిపినట్టు సమాచారం. 

గత శనివారం సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మిషన్ 2024పై ఆయన విశ్లేషణాత్మకమైన ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు సమాచారం. లోక్ సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను లక్ష్యంగా పెట్టుకుని, గెలుపు కోసం ప్రయత్నించాలని ఆయన సూచించారు. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్రల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని చెప్పారు. యూపీ, ఒడిశా, బీహార్ లో మాత్రం ఒంటరిగా పోటీ చేయాలని తెలిపారు. మరోవైపు పీకే సూచనలపై ఈ నెలాఖరున కాంగ్రెస్ పార్టీ స్పందించే అవకాశం ఉంది. 

మరోవైపు ప్రశాంత్ కిశోర్ తో భేటీకి ముందు చిదంబరం, కేసీ వేణుగోపాల్, అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, జైరాం రమేశ్, రణదీప్ సింగ్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్ వంటి కీలక నేతలతో సోనియా సమావేశమయ్యారు. ఈ సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది. ఈ భేటీకి రాహుల్ హాజరు కాలేదు.

  • Loading...

More Telugu News