Roja: నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగనన్న వెంటే నడుస్తాను: రోజా
- తనను మంత్రిగా నియమించడం తాన పూర్వజన్మ సుకృతమన్న రోజా
- ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని జగనన్న ఇచ్చారని వ్యాఖ్య
- పర్యాటకం, సంస్కృతి అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టీకరణ
- భైరవ ద్వీపం సినిమా ఇటీవలే 28 ఏళ్లు పూర్తి చేసుకుందన్న మంత్రి
ఏపీ కొత్త కేబినెట్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. ''జగనన్న అండదండలతో, భగవంతుడి ఆశీస్సులతో, నగరి ప్రజల ప్రేమాభిమానాలతో నన్ను మంత్రిగా నియమించడం నా పూర్వజన్మ సుకృతం అని అనుకుంటున్నాను.
ఎందుకంటే భగవంతుడంటే నాకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. అలాగే ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని జగనన్న నాకు ఇచ్చారు. నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగనన్న వెంటే నడుస్తాను. ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, మహిళల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయా రంగాల అభివృద్ధికి కృషి చేస్తాను'' అని రోజా అన్నారు.
తనకు మంత్రి పదవి రావాలంటూ ప్రార్థనలు చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. తాను నటించిన భైరవ ద్వీపం సినిమా ఇటీవలే 28 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆమె గుర్తు చేశారు. ఆ సినిమాలో తాను రాజకుమారిగా నటించానని అన్నారు.
అప్పుడే ఆ సినిమా విడుదలై 28 ఏళ్లు పూర్తయ్యాయని అంటే నమ్మలేకపోతున్నానని, నిన్న, మొన్నే ఆ సినిమాలో నటించినట్లు ఉందని అని అన్నారు. ఆ సినిమా ఫస్ట్ షాట్‌ను ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారని వివరించారు. తాను సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి 30 ఏళ్లు అవుతుందని చెప్పారు. బాలకృష్ణతో ఏడు సినిమాలు చేశానని అన్నారు. తమ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్‌గా నిలిచిందని రోజా అన్నారు.