Twitter: ఎడిట్ చేసినా.. పాత ట్వీట్ చెరిగిపోదులే..!
- ఎడిట్ బటన్ తీసుకురావడంపై పనిచేస్తున్న ట్వట్టర్
- ఎడిట్ చేసినా రికారుల్లో ముందు ట్వీట్ కూడా ఉంటుందంటూ సమాచారం
- మరిన్ని వివరాలపై స్పష్టత కోసం వేచి చూడాల్సిందే
ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న సదుపాయం ట్విట్టర్ యూజర్లకు త్వరలో రానుంది. ‘ట్విట్టర్ పై ఎడిట్ బటన్ ఎప్పటికీ ఉండదు’ అంటూ ట్విట్టర్ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో జాక్ డోర్సే గతంలో ఒక ప్రకటన చేశారు. కానీ, అది ఇప్పుడు బుట్టదాఖలు కానుంది. యూజర్ల అభిప్రాయానికి పెద్ద పీట వేయాలన్నది ట్విట్టర్ తాజా యోచన. అందుకే ఎడిట్ బటన్ తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు ప్రకటించింది.
ట్విట్టర్ పై ఎడిట్ బటన్ రావడానికి టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృషి కూడా కారణమేనని చెప్పుకోవాలి. ఎడిట్ బటన్ కోరుకుంటున్నారా? అంటూ ట్విట్టర్ లో ఎలాన్ మస్క్ పోల్ నిర్వహించారు. మెజారిటీ యూజర్లు కావాలని పోల్ చేశారు. దీంతో ఎడిట్ బటన్ తెస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించాల్సి వచ్చింది.
ఎడిట్ బటన్ ఉపయోగించుకుని ట్వీట్ లోని సమాచారాన్ని ఎడిట్ చేసినా.. పాత ట్వీట్ కూడా అలానే ఉంటుంది. ముందు చేసిన ట్వీట్ చెరిగిపోదు. అయితే మొదట చేసిన ట్వీట్ ను ఎడిట్ చేసిన తర్వాత అది తాజా ట్వీట్ కింద వెళుతుందా? అన్న దానిపై స్పష్టత లేదు. ముందు ట్వీట్ లోని సమాచారాన్ని మార్చేస్తుందా..? కొత్త ట్వీట్ గా పంపిస్తుందా? ఎడిట్ తర్వాత తాజా ట్వీట్ అందరికీ కనిపిస్తూ.. ముందు ట్వీట్ కేవలం ట్విట్టర్ డేటా బ్యాంకులో నిల్వ ఉంటుందా? లేదా ముందు ట్వీట్లు కూడా ఫాలోవర్లు అందరికీ దర్శనమిస్తాయా? ఈ వివరాలపై స్పష్టత కోసం కొంత కాలం వేచి చూడాల్సిందే.