Afghanistan: తాలిబన్ల రాజ్యంలో స్కూళ్లపై వరుస బాంబు దాడులు.. అమాయక విద్యార్థుల మృతి

Twin Bomb Blasts In Kabul Schools kills Over Dozen
  • కాబూల్ లోని ముంతాజ్, అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాలల్లో పేలుళ్లు
  • పది మందికిపైగా విద్యార్థుల మృతి
  • ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనన్న అనుమానం
తాలిబన్ల రాజ్యం ఆఫ్ఘనిస్థాన్ లో పిల్లలకూ రక్షణ లేకుండాపోతోంది. రాజధాని కాబూల్ లో ఉన్న రెండు పాఠశాలలపై దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తొలుత ముంతాజ్ స్కూల్ లో దాడి జరగ్గా.. ఆ వెంటనే కాబూల్ కు సరిహద్దుల్లోని దష్తీ బార్చిలో ఉన్న అబ్దుల్ రహీం షాహిద్ అనే పాఠశాల బయట రెండు ఐఈడీలతో ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడినట్టు ఖాలిద్ జద్రాన్ అనే పోలీస్ అధికారి చెప్పారు. ఈ పేలుళ్లలో పది మందికిపైగా విద్యార్థులు మరణించినట్టు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.

షియా హజారా అనే మైనారిటీ కమ్యూనిటీ ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో గతంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులకు తెగబడేవారని చెప్పారు. ఇప్పుడు దాడి చేసింది కూడా ఐఎస్ ఉగ్రవాదులేనని అనుమానిస్తున్నారు. అయితే, పేలుళ్లకు పాల్పడింది ఎవరన్నది మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కాగా, గత ఏడాది మేలో ఇదే ప్రాంతంలోని ఓ స్కూల్ లో జరిగిన పేలుళ్లలో 85 మంది మరణించగా.. 300 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువ మంది అమ్మాయిలే ఉండడం కలవరపరిచే అంశం. 

కాగా, గత ఏడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్థాన్ ను తమ అధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. దేశం సురక్షితంగా ఉందని ప్రకటిస్తున్నారు. అయితే, అంతర్జాతీయ నాయకులు మాత్రం తాలిబన్లపై ఫైర్ అవుతున్నారు. ఇప్పటికీ మహిళలకు అనేక కట్టుబాట్లను విధిస్తుండడంతో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు వెళ్లిపోవడంతో తాలిబాన్లకు ఆర్థిక పరంగా నష్టం చేసేందుకు వివిధ దేశాల్లోని ఆస్తులన్నింటనీ అంతర్జాతీయ బ్యాంకులు ఫ్రీజ్ చేశాయి. 

ఫలితంగా ఆఫ్ఘన్ ప్రజలు తిండికి అలమటించిపోయారు. పిల్లలకు అన్నం పెట్టేందుకు తల్లిదండ్రులు కడుపు ఎండబెట్టుకున్నారు. నిత్యవసరాల ధరలూ బీభత్సంగా పెరిగిపోయాయి.
Afghanistan
Kabul
Taliban
Bomb Blast
School

More Telugu News