Chiranjeevi: చిరూ, చరణ్ ల పాట చిత్రీకరిస్తుంటే చూడడానికి రోజుకి 20 మందికి పైగా దర్శక నిర్మాతలు వచ్చేవారు: శేఖర్ మాస్టర్
- 'జులాయి' సినిమాకి బన్నీ ఛాన్స్ ఇచ్చారు
- ఆ సినిమా టర్నింగ్ పాయింట్ అయింది
- 'ఆచార్య'కి పనిచేయడం అదృష్టం
- అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందన్న శేఖర్ మాస్టర్
టాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. 'ఆచార్య' సినిమాలో చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని పాటను ఆయనే కంపోజ్ చేశారు. ఆ పాట గురించి తాజా ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ .. "చిరంజీవి - చరణ్ కలిసి డాన్స్ చేస్తుంటే నిజంగా ఒక పండుగలా ఉంటుంది. ఆ డాన్స్ ను కంపోజ్ చేసేవరకూ నాకు నిద్రపట్టలేదు.
ఆ పాటకి రిహార్సల్స్ తరువాత షూటింగుకి వెళ్లాము. ఆ పాట చిత్రీకరణ జరుగుతున్నన్ని రోజులు, చాలామంది దర్శక నిర్మాతలు సెట్ కి వచ్చేవారు. చిరంజీవి గారు .. చరణ్ గారు కలిసి డాన్స్ చేస్తుంటే చూడటానికి రోజుకి 20 మందికి పైగా దర్శక నిర్మాతలు వచ్చేవారు. ఇంతమంది దర్శక నిర్మాతలు ఒక సెట్ కి తరలిరావడమనేది ఈ పాట విషయంలోనే జరిగిందేమో.
షూటింగు సమయంలోనే ఈ పాట ఇంత ఆసక్తిని రేకెత్తించిందంటే, ఇక థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఊహించుకోవచ్చు. సుధీర్ బాబు 'ఎస్ ఎమ్ ఎస్' సినిమా చూసి, 'జులాయి' సినిమాలో నాకు బన్నీ అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి స్టార్ హీరోలకు చేసే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లో ఒక ఫుల్ సాంగ్ కి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు .