Nandigam Suresh: ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదని.. కానిస్టేబుల్‌పై నందిగం సురేశ్ ఫైర్

MP Nandigam Suresh angry with Constable
  • రాయపూడి వద్ద వాహన తనిఖీలు
  • బైకర్‌ను ఆపి పత్రాలు చూపించమన్న పోలీసులు
  • ఎంపీ నందిగం సురేశ్ మనిషినని చెప్పిన వ్యక్తి
  • అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనన్న పోలీసులు
  • కానిస్టేబుల్‌ను తానేమీ అనలేదన్న ఎంపీ
తాను ఎంపీనని చెబుతున్నా మర్యాద ఇవ్వలేదంటూ ఓ కానిస్టేబుల్‌పై ఎంపీ నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద పోలీసులు నిన్న సాయంత్రం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ బైకర్‌ను ఆపిన పోలీసులు పత్రాలు చూపించమని అడిగారు. 

అయితే, తాను ఎంపీ నందిగం సురేశ్ మనిషినని చెప్పాడు. అయినా సరే పత్రాలు చూపించాల్సిందేనని నిలదీశారు. దీంతో ఆయన ఎంపీకి ఫోన్ చేసి విషయం చెప్పి ఫోన్‌ను కానిస్టేబుల్‌కు ఇచ్చాడు. తాను ఎంపీని మాట్లాడుతున్నానని, అతడిని విడిచిపెట్టాలని సురేశ్ కోరారు. అందుకు కానిస్టేబుల్ ముక్తసరిగా సరేనని చెప్పి వదిలిపెట్టాడు. 

అయితే, తాను ఎంపీనని చెబుతున్నా గౌరవం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన సురేశ్.. వెంటనే తన ఇంటికి రావాలని ఆ కానిస్టేబుల్‌ను ఆదేశించినట్టు తెలిసింది. మరోవైపు, ఇదే విషయమై పోలీసు ఉన్నతాధికారికి ఎంపీ ఫిర్యాదు చేసినట్టు సమాచారం. 

విషయం బయటకు పొక్కడంతో స్పందించిన ఎంపీ సురేశ్.. తాను కానిస్టేబుల్‌ను ఏమీ అనలేదని, హెల్మెట్ ఉంచుకుని కూడా పెట్టుకోనందుకు తన మనిషిపైనే ఆగ్రహం వ్యక్తం చేశానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, అదే కానిస్టేబుల్ గతంలో తాను అతడికి ఫేవర్‌గా చేసిన పనిని గుర్తు చేసుకున్నారని ఎంపీ వివరించారు.
Nandigam Suresh
Andhra Pradesh
Police
Constable

More Telugu News