KL Rahul: బౌలర్ల తప్పిదాలే కొంప ముంచాయ్: కేఎల్ రాహుల్

KL Rahul regrets bowling errors as RCB snatch victory despite horror start
  • బ్యాటింగ్ లోనూ రాణించలేదు
  • టాప్ ఆర్డర్ లో ఒక్కరూ నిలబడలేదు
  • ఫాప్ మాదిరి ప్లేయర్ మాకు అవసరం
  • ఓటమికి కారణాలపై లక్నో జట్టు కెప్టెన్ అంతరంగం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి స్వీయ వైఫల్యమనే చెప్పుకోవాలి. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో మంగళవారం రాత్రి ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఆరంభం అదిరింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ లోనే దుష్మంత చమీర.. అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ వికెట్ లు తీసి ఒత్తిడి పెంచాడు. 

తర్వాత కొద్ది సేపటికే మ్యాక్స్ వెల్ వికెట్ కూడా పడిపోయింది. 47 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయినా జట్టు కెప్టెన్ డూప్లెసిస్ కుదురుకుని వీలైనప్పుడల్లా బౌలర్లను ఆడుకున్నాడు. 96 పరుగులు సాధించి ఆర్సీబీ స్కోరును మెరుగైన స్థితికి తీసుకెళ్లాడు. ఆరంభంలో వికెట్లను తీసినా, ఆ తర్వాత లక్నో బౌలర్లు రాణించలేకపోయారు. దీనికంటే కూడా ఆర్సీబీ బ్యాటర్లు కుదురుకున్నారనే చెప్పుకోవాలి. లక్నో బ్యాటర్లు అంతగా రాణించలేకపోయారు. ఒత్తిడిలో వికెట్లు సమర్పించుకున్నారు. చివరికి 18 పరుగుల తేడాతో ఓటమి చవిచూశారు. 

దీనిపై లక్నో జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ స్పందిస్తూ.. తమ బౌలర్లు మరింత మెరుగ్గా రాణించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘‘మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు తీసి బాగా ఆరంభించాం. అయినా కానీ, పవర్ ప్లేలో 50 పరుగులు సమర్పించుకున్నాం. ఇంకా కుదురుగా బౌలింగ్ చేసి ఉండాల్సింది. పిచ్ పై 180 పరుగులు అంటే మేము 15-20 పరుగులు ఎక్కువ ఇచ్చుకున్నాం. పిచ్ చాలా స్టిక్కీగా ఉంది. ఫాప్ డూప్లెసిస్ మాదిరి మా వైపున మంచి భాగస్వామ్యం అవసరం ఉంది. 

టాప్ ఆర్డర్ లో మొదటి ముగ్గురు లేదా నలుగురిలో ఎక్కువ సమయం పాటు ఇన్నింగ్స్ ఆడగల బ్యాటర్ మాకు కావాలి. కానీ, మా వైపు నుంచి అది లోపించింది’’ అని ఓటమి కారణాలను రాహుల్ విశ్లేషించాడు. రాహుల్ 30 పరుగులు, కృనాల్ పాండ్య 42 పరుగులు మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు సాధించలేదు. వచ్చామా వెళ్లామా అన్నట్టు ఆడి ఓటమి మూటగట్టుకున్నారు.
KL Rahul
regrets
defeat
RCB
IPL

More Telugu News