Netflix: చందాదారులను ఆకట్టుకోవడానికి.. నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలో చౌక ప్లాన్లు
- జనవరి - మార్చి మధ్య తగ్గిన చందాదారులు
- 2 లక్షల మంది దూరం
- దీంతో ప్రకటనలతో చౌక ప్లాన్లు తేవాలని నిర్ణయం
- తద్వారా మరింత మంది యూజర్లపై కన్ను
ప్రకటనల్లేని వినోదానికి ప్రాధాన్యమిచ్చే నెట్ ఫ్లిక్స్ రూటు మార్చింది. త్వరలో ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్లను తీసుకురానున్నట్టు ప్రకటించింది. దీనికి కారణం చందాదారులను కోల్పోతుండడమే. దీంతో ఏం చేయాలో సంస్థకు తోచడం లేదు. చౌక ప్లాన్ల వ్యూహం ఫలితాలనిస్తుందని సంస్థ భావిస్తోంది.
2022 జనవరి - మార్చి మధ్య అంతర్జాతీయంగా నెట్ ఫ్లిక్స్ 2 లక్షల మంది చందాదారులను కోల్పోయింది. ద్రవ్యోల్బణానికి తోడు, రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం సంస్థపై ప్రభావం చూపిస్తోంది. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించిన దశాబ్ద కాలంలో ఈ స్థాయిలో చందాదారులను కోల్పోవడం ఎప్పుడూ లేదు. దీంతో మరింత మంది చందాదారులను కోల్పోకుండా ఉండేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ప్రకటనలతో కూడిన చౌక ప్లాన్లను తీసుకురావాలని నిర్ణయించింది.
ఏప్రిల్, జూన్ త్రైమాసికంలోనూ మరో 2 లక్షల మంది చందాదారులు తగ్గిపోవచ్చని నెట్ ఫ్లిక్స్ అంచనా వేస్తోంది. వాస్తవానికి 2022 మొదటి మూడు నెలల్లో 2.5 లక్షల మంది చందాదారులను పెంచుకోవాలన్నది సంస్థ వ్యూహం. దీనికి విరుద్ధంగా 2 లక్షల మంది తగ్గిపోయారు. కరోనా లాక్ డౌన్ ల సమయంలో ఈ సంస్థ చందాదారులను భారీగా పెంచుకోవడం గమనార్హం. తాజా ఫలితాలతో నెట్ ఫ్లిక్స్ షేరు మంగళవారం 26 శాతం నష్టపోయింది.
‘‘ప్రకటనల గందరగోళానికి నేను వ్యతిరేకమని నెట్ ఫ్లిక్స్ ను అనుసరించే వారికి తెలుసు. సబ్ స్క్రిప్షన్ సింపుల్ గా ఉండాలనేదానికి అనుకూలం. వినియోగదారుల ఎంపిక పట్ల కూడా నేను పెద్ద అభిమానినే’’ అని నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ హ్యాస్టింగ్స్ పేర్కొన్నారు.