AP Cabinet: జగన్‌తో తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ.. కాకాణితో విభేదాలపై వివరణ
- కేబినెట్ రీషఫిలింగ్లో మంత్రి పదవిని కోల్పోయిన అనిల్
- కొత్తగా మంత్రి అయిన కాకాణితో విభేదాలంటూ వార్తలు
- ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం
- పార్టీ ఆదేశాల మేరకే జగన్‌తో అనిల్ భేటీ
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తాజా మాజీ మంత్రిగా మారిపోయిన అనిల్ కుమార్ యాదవ్ బుధవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్... జిల్లాకు చెందిన కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో విభేదిస్తున్నట్లుగా ఇటీవల పుకార్లు వినిపించిన సంగతి తెలిసిందే.
ఈ పుకార్లు నిజమేనన్నట్లుగా నెల్లూరులో మంత్రి అభినందన సభ రోజే.. అనిల్ కూడా కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్, కాకాణి ఇద్దరూ పేర్లు ప్రస్తావించకుండానే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఈ వ్యవహారంపై దృష్టి సారించిన పార్టీ అధిష్ఠానం ఇద్దరు నేతలు వచ్చి సీఎం జగన్‌ను కలవాలని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అనిల్ కాసేపటి క్రితం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సింగిల్‌గానే వచ్చిన అనిల్ నేరుగా జగన్ వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా కాకాణితో తనకున్న విభేదాలపై జగన్‌కు ఆయన వివరణ ఇచ్చినట్లు సమాచారం.