Sonu Sood: ప్రజలకు సేవ చేయాలంటే ఏం కావాలో చెప్పిన సోనూ సూద్
- కరోనా సంక్షోభం వేళ రక్షకుడిగా పేరుగాంచిన సోనూ
- ఆపద్బాంధవుడిలా సేవలందించిన వైనం
- వలస కూలీలను ఆదుకున్న సోనూ సూద్
ప్రముఖ నటుడు సోనూ సూద్ తన నటనా ప్రతిభ కంటే సామాజిక సేవ ద్వారా దేశం నలుమూలలా ఖ్యాతి పొందాడు. కరోనా సంక్షోభం సమయంలో వలస కూలీల తరలింపు కోసం ఆయన చేసిన ఏర్పాట్లు అందరినీ ఆకట్టుకున్నాయి. విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని కూడా స్వదేశానికి తరలించడంలో ఎంతో ఔదార్యం ప్రదర్శించారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు వెనుకాడని సోనూ సూద్ తీరు ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించిపెట్టింది.
ఈ నేపథ్యంలో, సోనూ సూద్ తాజాగా పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగా రాజకీయాలంటే తనకు ఆసక్తిలేదని స్పష్టం చేశారు. ప్రజా సేవకు అధికారం అవసరంలేదన్నది తన అభిప్రాయమని, ప్రజాసేవ చేయాలంటే దేవుడి దయ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను సినిమాలు, సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని, సేవా కార్యక్రమాలను దేశవ్యాప్తంగా విస్తరించడంపై దృష్టి సారించానని సోనూ సూద్ వెల్లడించారు. రాజకీయాల్లోకి మాత్రం వెళ్లనని స్పష్టం చేశారు.
ఏపీలో అంకుర హాస్పిటల్స్ కు సోనూ సూద్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఇప్పటివరకు 11 ఆసుపత్రులు ఏర్పాటు చేసిన అంకుర గ్రూప్ తాజాగా 12వ ఆసుపత్రికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బ్రాండ్ అంబాసిడర్ హోదాలో సోనూ సూద్ కూడా పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో యువత కీలకపాత్ర పోషించాలని, కరోనా సంక్షోభం నెమ్మదించినా సమస్యలు మాత్రం తొలగిపోలేదని విచారం వ్యక్తం చేశారు. తాను నటించిన ఆచార్య చిత్రం విడుదలకు సిద్ధమవుతోందని, మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశానని వివరించారు.