Mettu Govinda Reddy: ప్రజలకు సేవ చేసేందుకు వచ్చాను... గౌరవ వేతనం అక్కర్లేదన్న ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి
- ఏపీఐఐసీ చైర్మన్ గా కొనసాగుతున్న మెట్టు గోవిందరెడ్డి
- గతేడాది నియామకం.. వేతనంగా రూ.65 వేలు
- ఇతర అలవెన్సులు కూడా వద్దన్న మెట్టు
ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పదవి రీత్యా వచ్చే గౌరవ వేతనం తనకు అక్కర్లేదని పేర్కొన్నారు. తాను ప్రజాసేవ చేసేందుకే వచ్చానని, అందుకే గౌరవ వేతనాన్ని తిరిగి ఖజానాకే జమ చేస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ఏపీఐఐసీ ఎండీ సుబ్రహ్మణ్యంకు మెట్టు గోవిందరెడ్డి లేఖ రాశారు. తనకు ఇతర అలవెన్సులు కూడా వద్దని తెలిపారు.
ఏపీఐఐసీ చైర్మన్ గా గోవిందరెడ్డికి రూ.65 వేల వరకు గౌరవ వేతనం లభిస్తుంది. గతంలో అది రూ.3 లక్షలకు పైగా ఉండేది. అయితే, ప్రభుత్వం కార్పొరేషన్ చైర్మన్ ల గౌరవ వేతనాలకు సీలింగ్ విధించడంతో బాగా కోత పడింది.
మెట్టు గోవిందరెడ్డి అనంతపురం జిల్లా రాజకీయవేత్త. ఆయన గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరారు. అంతకముందు 2004లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, 2009లో ఓటమిపాలయ్యారు. 2014లో కాల్వ శ్రీనివాసులు కోసం పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు టీడీపీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది.
2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే బరిలో దిగాలని భావించినా, టీడీపీ నుంచి టికెట్ లభించకపోవడంతో పార్టీని వీడారు. వైసీపీలో చేరిన గోవిందరెడ్డికి సీఎం జగన్ సముచిత గుర్తింపునిచ్చారు. గతేడాది నామినేటెడ్ పోస్టుల భర్తీ సందర్భంగా ఆయనకు ఏపీఐఐసీ చైర్మన్ పదవి అప్పగించారు.