Wimbledon: రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లు వింబుల్డన్ లో ఆడడంపై నిషేధం
- ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
- రష్యాకు సహకరిస్తున్న బెలారస్
- జూన్ 27 నుంచి జులై 10 వరకు వింబుల్డన్
- కీలక నిర్ణయం తీసుకున్న టోర్నీ నిర్వాహకులు
టెన్నిస్ ప్రపంచంలో వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టోర్నీకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్క టెన్నిస్ క్రీడాకారుడు ఇక్కడి గ్రాస్ కోర్టుల్లో ఆడాలని కోరుకుంటారు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూన్ 27 నుంచి జులై 10వ తేదీ వరకు జరగనుంది. అయితే, రష్యాకు చెందిన ఆటగాళ్లు వింబుల్డన్ లో ఆడడంపై నిషేధం విధించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తుండడమే అందుకు కారణం. అంతేకాదు, రష్యాకు బెలారస్ సహకరిస్తున్న నేపథ్యంలో బెలారస్ కు చెందిన క్రీడాకారులపైనా నిర్వాహకులు నిషేధం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్, బెలారస్ మహిళా టెన్నిస్ తార సబలెంక వింబుల్డన్ లో పాల్గొనడంపై అనిశ్చితి ఏర్పడింది. అయితే, ఆయా దేశాల క్రీడాకారులు వ్యక్తిగతంగా టోర్నీలో పాల్గొనవచ్చని, దేశం పేరిట పాల్గొనలేరని వింబుల్డన్ యాజమాన్యం పేర్కొంది. మెద్వెదెవ్ ప్రస్తుతం పురుషుల సింగిల్స్ వరల్డ్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉండగా, సబలెంక వరల్డ్ ఉమెన్స్ ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానంలో ఉంది.