New Delhi: ఘర్షణలకు శాశ్వత ముగింపు కావాలంటే.. తొలుత అమిత్ షా ఇల్లు కూల్చాలి: ఆప్

Amit Shahs residence to end riots says AAPs Raghav Chadha

  • రాజధానిలో ఆక్రమణల కూల్చివేతలపై తీవ్రంగా స్పందించిన ‘ఆప్’
  • బుల్డోజర్లతో హింసను ఆపొచ్చని బీజేపీ అనుకుంటోందన్న కేజ్రీవాల్ పార్టీ
  • ఢిల్లీలో నేటి పరిస్థితికి బీజేపీనే కారణమని ఆరోపణ

ఉత్తర ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో మునిసిపల్ అధికారులు చేపట్టిన కూల్చివేతలపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. కూల్చాల్సింది వాటిని కాదని, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇంటిని కూల్చేస్తేనే దేశంలో ఘర్షణలకు శాశ్వత ముగింపు లభిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 

బుల్డోజర్లతో హింస, అల్లర్లు, దాదాగిరిని ఆపొచ్చని, ఆక్రమణలను తొలగించవచ్చని బీజేపీ అనుకుంటోందని, నిజానికి వీటన్నింటికీ బీజేపీనే కారణమని ఆప్ నేత ఆతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామనవమి, హనుమజ్జయంతి సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో చెలరేగిన మత ఘర్షణల వెనక అమిత్ షా, బీజేపీ ఉన్నట్టు ఆరోపించారు. 

బుల్డోజర్లతో ఇళ్లు కూల్చాల్సి వస్తే తొలుత కూల్చాల్సింది అమిత్ షా ఇంటినేనని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. అది జరిగితే తప్ప దేశంలో ఘర్షణలు ఆగబోవన్నారు. ఢిల్లీలో నేటి పరిస్థితికి బీజేపీనే కారణమని, ఢిల్లీని 15 ఏళ్లు పాలించిన బీజేపీ ఆ సమయంలో లంచాలు తీసుకుని అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిందని ఆరోపించారు. దేశంలో మత ఘర్షణలు రేకెత్తించేందుకు బంగ్లాదేశీయులకు, రోహింగ్యాలకు బీజేపీ 8 ఏళ్లుగా పునరావాసం కల్పిస్తోందని చద్దా ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News