Sabitha Indra Reddy: ఉద్యోగార్థులు బాగా ప్రిపేర్ కావాలి.. ఆల్ ది బెస్ట్: సబితా ఇంద్రారెడ్డి
- తెలంగాణలో పెద్ద ఎత్తున జరగనున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- ఆరు యూనివర్శిటీల్లో ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- కోచింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదన్న సబిత
తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనున్న సంగతి తెలిసిందే. భారీ ఎత్తున నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆరు యూనివర్శిటీల్లో ఫ్రీ కోచింగ్ ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. వర్చువల్ మోడ్ విధానంలో ఫ్రీ కోచింగ్ ను సబిత, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ లింబాద్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫ్రీ కోచింగ్ కోసం ఆరు యూనివర్శిటీలకు నిధులు అందించామని చెప్పారు. నాణ్యతతో కూడిన కోచింగ్ ఇస్తామని తెలిపారు. ఉద్యోగార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండా యూనివర్శిటీల్లోనే ఉచిత కోచింగ్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని అన్నారు.
ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ ఒకేసారి ఇవ్వకుండా... ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. స్టడీ మెటీరియల్ కొరత లేకుండా చూస్తామని అన్నారు. దీని వల్ల ఎక్కువ మందికి అవకాశం వస్తుందని అన్నారు. అందరూ కష్టపడి చదవాలని సూచిస్తూ... అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.