Chandrababu: సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లింది?: చంద్రబాబు మండిపాటు
- కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తున్న వినుకొండ వాసి
- అతడి కారును సీఎం పర్యటన కోసం తీసుకెళ్లారని చంద్రబాబు ఆగ్రహం
- ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య
- కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారని నిలదీత
కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ వ్యక్తి కారుని ఒంగోలు వద్ద పోలీసులు తీసుకెళ్లారు. ఈ విషయంపై బాధితులు మాట్లాడుతూ.. తాము తిరుపతికి వెళ్తూ భోజనం కోసం ఓ హోటల్ వద్ద ఆగామని చెప్పారు. అందుకోసం కారు పార్క్ చేసి హోటల్ లోకి వెళ్లి, తిరిగి వచ్చి చూసేసరికి అక్కడ కారు లేదని తెలిపారు.
కారు ఏమయిందని పోలీసులను అడిగితే సీఎం పర్యటన నేపథ్యంలో కార్లు లేకపోవడంతో తమ కారు తీసుకెళ్లామని చెప్పారని బాధితులు వివరించారు. సీఎం పర్యటన కోసం వాహనాలు కావాలంటే ప్రజల కార్లు తీసుకెళ్లడం ఏంటని బాధితులు ప్రశ్నించారు. నడిరోడ్డుపై తాము గంటన్నర నుంచి నిలబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను పలు యూట్యూబ్ చానెళ్లు ప్రసారం చేశాయి.
పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆ ఘటనపై ఓ ప్రకటన చేస్తూ... జగన్ కాన్వాయ్ కోసం తిరుమల వెళ్లే భక్తుల కారును లాక్కెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఏపీలో నెలకొన్న దౌర్భాగ్య పాలనకు ఇదే నిదర్శనమని ఆయన అన్నారు.
కుటుంబాన్ని రోడ్డుపై దింపే హక్కు ఎవరు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాన్వాయ్ కోసం ప్రజల కారును తీసుకెళ్లే స్థితికి రాష్ట్రం ఎందుకెళ్లిందని ఆయన నిలదీశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే ఇటువంటి చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.