Chandrababu: ఓట్లు వేయించలేని సీనియర్లకు ప్రాధాన్యతను ఇస్తూ పోతే ప్రతిపక్షంలోనే ఉంటాం!: చంద్రబాబు
- వైసీపీ పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న చంద్రబాబు
- సమాజానికి తెలుగుదేశం అవసరం ఉందని వ్యాఖ్య
- సమాజ హితం కోసమే విరాళాలను సేకరిస్తున్నామన్న టీడీపీ అధినేత
వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునేందుకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. భయపడితే కోలుకోలేని విధంగా దెబ్బతింటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోరాటాన్ని ఆయుధంగా మలచుకోవాలని అన్నారు.
అమరావతిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అందరికీ తాను అండగా ఉంటానని చెప్పారు. సమాజానికి తెలుగుదేశం అవసరం ఉందని... సమాజ హితం కోసం విరాళాలను సేకరిస్తున్నామని తెలిపారు. విరాళాలు వస్తే కొందరికైనా సాయం చేయవచ్చని చెప్పారు.
పార్టీలో సీనియార్టీతో పాటు సిన్సియార్టీని కూడా గుర్తిస్తామని చంద్రబాబు అన్నారు. సీనియార్టీ ఉన్నప్పటికీ ఓట్లు వేయించలేకపోతే ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. ఓట్లు వేయించలేని సీనియర్లకు ప్రాధాన్యతను ఇస్తూ పోతే ప్రతిపక్షంలోనే ఉంటామని అన్నారు. 40 శాతం సీట్లను యువతకు ఇవ్వాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. పార్టీ కోసం పని చేసే యువ నేతలను గుర్తిస్తామని... వారికి కూడా అవకాశాలను కల్పిస్తామని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పని చేయకుండా... పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతూ మాయ చేసే నాయకులకు చెక్ పెడతామని అన్నారు.