Telangana: ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై నివేదిక ఇవ్వండి: ప్రభుత్వాన్ని ఆదేశించిన గవర్నర్ తమిళిసై
- బీజేపీ నేతల వినతి పత్రానికి గవర్నర్ స్పందన
- సాయిగణేశ్, తల్లీకుమారుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక కోరిన తమిళిసై
- ప్రైవేటు వైద్య కళాశాలల పీజీ సీట్ల దందాపై ఆగ్రహం
ఖమ్మం, కామారెడ్డి జిల్లాలలో జరిగిన రెండు ఘటనలకు సంబంధించి సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో సామినేని సాయి గణేశ్, కామారెడ్డి జిల్లాలో తల్లీకుమారుల ఆత్మహత్యల ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇటీవల గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు ఈ ఘటనలపై మీడియా, సోషల్ మీడియాలలో వచ్చిన కథనాలను సమర్పించి చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రం ఇచ్చారు.
దీనికి స్పందించిన గవర్నర్.. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అలాగే, రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలు పీజీ సీట్లను బ్లాక్ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైనా నివేదిక ఇవ్వాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని ఆదేశించారు.