Prashant Kishor: తెలంగాణలో ఒంటరిగా, ఏపీలో జగన్‌తో కలిసి పోటీ చేద్దాం: కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదన

Prashant Kishor proposal to congress A Gandhi to be Congress chief and a non Gandhi VP
  • పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వెలుగులోకి
  • అధిష్ఠానం వద్ద రెండు ప్రతిపాదనలు
  • 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలన్న పీకే
  • మిగతా రాష్ట్రాల్లో మాత్రం పార్టీలను కలుపుకుపోవాలని సూచన
  • గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిని చేయాలన్న ప్రశాంత్ కిశోర్
వరుస ఓటములతో కునారిల్లిన కాంగ్రెస్ పార్టీలో తిరిగి జవసత్వాలు నింపడంలో భాగంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద చేసిన తాజా ప్రతిపాదన ఒకటి బయటకు వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సూచిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానానికి పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడది వెలుగులోకి వచ్చింది. 

తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలని, ఏపీలో మాత్రం జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ వైఎస్సార్ సీపీతో కలిసి వెళ్లాలని ప్రతిపాదించారు. అలాగే, తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీతో, ఝార్ఖండ్‌లో జేఎంఎంతో వెళ్లడం వల్ల ప్రయోజనం ఉంటుందని పీకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వివరించారు. అలాగే, జమ్మూకశ్మీర్‌లో నేషన్ కాన్ఫరెన్స్, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లడం మేలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారు. 

గత ఎన్నికల్లో ఈ పార్టీలన్నీ కలిసి 128 స్థానాలలో విజయం సాధించాయని, 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచాయని చెప్పుకొచ్చారు. ఇవన్నీ కలిపితే మొత్తం 377 స్థానాలు అవుతాయని చెప్పారు. బీజేపీతో నేరుగా తలపడే రాష్ట్రాల్లో మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి, మిగిలిన రాష్ట్రాల్లో ఐదారు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం లాభిస్తుందని చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనతోపాటు పార్టీలో కొన్ని సంస్థాగత మార్పులను కూడా పీకే సూచించారు. అందులో ముఖ్యమైన వాటిలో.. యూపీఏ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ సీనియర్ నేతను నియమించడం, పార్టీ అధ్యక్షురాలిగా సోనియా కొనసాగడం, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గాంధీయేతర కుటుంబ సభ్యుడిని నియమించడం, పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా రాహుల్‌ను ఎన్నుకోవడం, కోఆర్డినేషన్ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీని నియమించడం వంటివి ఒక ప్రతిపాదన. 

రెండో ప్రతిపాదనలో సోనియాను యూపీఏ చైర్‌పర్సన్‌గా ఎన్నుకుని, గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం వంటివి ఉన్నాయి. రాహుల్‌ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్ట సభలో ప్రధాని వర్సెస్ రాహుల్‌గా మారుతుందని, ఫలితంగా పార్లమెంటు లోపల, వెలుపల ప్రజల గొంతును వినిపించేందుకు వీలవుతుందని పీకే సూచించారు. అలాగే, ఒకే వ్యక్తి, ఒకే పదవి సిద్ధాంతాన్ని కూడా అనుసరించాలని ప్రశాంత్ కిశోర్ సూచించినట్టు తెలుస్తోంది.
Prashant Kishor
Congress
Sonia Gandhi
Rahul Gandhi
Priyanka Gandhi
Telangana
Andhra Pradesh
YSRCP

More Telugu News