YSRCP: వైసీపీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగింపుపై కిల్లి కృపారాణి స్పందన ఇదే
- పదవి నుంచి తొలగించినందుకు బాధ లేదన్న కృపారాణి
- మరింత పెద్ద బాధ్యత అప్పగించేందుకే సీఎం నిర్ణయమని వ్యాఖ్య
- ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పనిచేస్తానన్న కిల్లి కృపారాణి
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో ఇటీవలే జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఈ క్రమంలో అప్పటిదాకా ఆయా జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని పార్టీ తప్పించింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ పదవిలో కొత్తగా తాజా మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ నియమితులయ్యారు.
ఇక తనను పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన వైనంపై కృపారాణి స్పందించారు. "పార్టీ జిల్లా అధ్యక్షురాలి బాధ్యతల నుంచి నన్ను తప్పించడంపై బాధ లేదు. మరింత పెద్ద బాధ్యతలను అప్పగించేందుకే సీఎం నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నా. పార్టీ కోసం సాధారణ కార్యకర్తగా పనిచేసేందుకు సిద్ధం. పార్టీలోని కొందరు నేతలు వ్యక్తిగత విభేదాలను పార్టీపై రుద్దడం బాధాకరం. ధర్మాన కృష్ణదాస్‌తో కలిసి పనిచేస్తా. వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాం" అని పేర్కొన్నారు.