Taneti Vanita: విజయవాడ అత్యాచార బాధితురాలికి రూ.10 లక్షల చెక్ అందించిన హోంమంత్రి తానేటి వనిత
- మానసిక వికలాంగురాలిపై దారుణం
- బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారం
- రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం జగన్
- బాధితురాలిని పరామర్శించిన మంత్రులు
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలిని రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత పరామర్శించారు. సీఎం జగన్ ప్రకటించిన మేరకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్టపరిహారం చెక్ ను అందజేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని ఆసుపత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా హోం మంత్రి వనిత మాట్లాడుతూ, అత్యాచార ఘటన అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అర్హతలను పరిశీలించి బాధితురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు వచ్చేలా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇంకా బాధితురాలిని పరామర్శించిన వారిలో మంత్రులు జోగి రమేశ్, విడదల రజని, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జిల్లా అధికారులు ఉన్నారు.