Electric vehicles: ఎలక్ట్రిక్ వాహనం వాడుతున్నారా..? ఈ వేసవి ముగిసే వరకు తస్మాత్ జాగ్రత్త!

Electric vehicles at more risk as mercury soars
  • అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే శక్తి వీటికి లేదు
  • బ్యాటరీలో 50 డిగ్రీలు దాటితే ప్రమాదం
  • రానున్న రోజుల్లో అధిక ఉష్ణోగ్రతలకు అవకాశం
  • ప్రమాద రిస్క్ పెరుగుతుందని నిపుణుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగాను ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీలు) అగ్ని ప్రమాద ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లోనే ఈ ప్రమాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న దృష్ట్యా ప్రమాద రిస్క్ ఇంకా అధికమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈవీల తయారీలో వినియోగించే బ్యాటరీలను కంపెనీలు చైనా, దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. భారత వాతావరణ పరిస్థితులకు ఇవి అనుకూలం కాదన్నది నిపుణుల అభిప్రాయం. లిథియం అయాన్ సెల్స్ అన్నవి 20 డిగ్రీల నుంచి 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య పనిచేయడానికి అనువైనవి. ఉష్ణోగ్రతలు ఇంతకు మించి పెరిగినప్పుడు సమస్యలు ఎదురవుతాయి. 

ఇటీవలి ప్రమాదాలు వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే నమోదైన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ‘‘బయటి ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల సెల్సియస్ ఉన్న సమయంలో లిథియం అయాన్ బ్యాటరీలోని సెల్స్ , బ్యాటరీ ప్యాక్ లలో 50-55 డిగ్రీల మధ్య ఉంటుంది. ఆ సమయంలో బ్యాటరీలోని సెల్స్ లో వేడి నియంత్రణ అదుపు తప్పుతుంది. ఇదే అగ్ని ప్రమాదానికి దారితీస్తుంది’’ అని ఈవీ నిపుణుడు రాజీవ్ తెలిపారు. 

ఎటువంటి సందర్భాల్లో బ్యాటరీల్లో ప్రమాదం ఏర్పడవచ్చు, భద్రత కోసం ఏ తరహా చర్యలు, జాగ్రత్తలు అనుసరించాలన్న దానిపై వినియోగదారుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు వేగంగా ఈవీలను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు చూస్తున్నాయని, ఈ క్రమంలో తక్కువ నాణ్యత కలిగిన బ్యాటరీలు, సెల్స్ ను కొనుగోలు చేస్తున్నట్టు నిపుణులు తెలిపారు. ఇది కూడా ప్రమాదాలకు దారితీసే అంశంగా పేర్కొంటున్నారు. భారత్ లోని వాతావరణ పరిస్థితులు, రోడ్డు కండిషన్లకు తగ్గట్టు ఈవీ బ్యాటరీలను మన దేశమే తయారు చేసుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తున్నారు.
Electric vehicles
ev
explode
fire

More Telugu News